
టాలీవుడ్ లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. సార్, లక్కీ భాస్కర్ తర్వాత రీసెంట్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో మరో విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ సాధించారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ డైరెక్టర్, తాజాగా 'తెలుగు వన్' ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈనాటి ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. "70లు, 80ల నాటి సీరియస్ డ్రామాలు ఇప్పుడు వర్కవుట్ కావు. ఎంత పెద్ద ఎమోషన్ అయినా చిన్న సర్కాజమ్, హ్యూమర్ మిక్స్ చేసి చెప్తేనే ఇప్పటి జెన్-జీ (Gen-Z) ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే నా ప్రతి సినిమాలోనూ డైలాగ్స్, ఎమోషన్స్‌తో పాటు ఫన్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటాను" అని వెల్లడించారు.
సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ గురించి చెబుతూ, ఒక కామెడీ సీన్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఆమెకు వాళ్ల అమ్మగారు కన్నుమూశారనే చేదు వార్త తెలిసిందని, అయినప్పటికీ ఆ సీన్‌ను ఎంతో నిబద్ధతతో పూర్తి చేసి వెళ్లిపోయారని వెంకీ అట్లూరి భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే నటుడు సూర్య సినిమా చూసిన వెంటనే ఎంతో సంతోషపడి తనను కౌగిలించుకుని అభినందించారని గుర్తు చేసుకున్నారు.
సినీ ప్రయాణంలో బడ్జెట్ నియంత్రణపై మాట్లాడుతూ, ప్రతి రూపాయికీ దర్శకుడే జవాబుదారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీతో ఉన్న అనుబంధం కేవలం డబ్బుతో ముడిపడి ఉన్నది కాదని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన నిజమైన మిత్రుడని చెప్పారు. అందుకే ఇప్పటి వరకు తాను ఆయన బ్యానర్‌లో అగ్రిమెంట్స్ పై సంతకాలు కూడా చేయలేదని వెల్లడించారు.
తమ సినీ కెరీర్ ప్రయాణంలో.. నటుడిగా ఉండటం కంటే రైటింగ్, డైరెక్షన్‌లోనే తనకు పూర్తి కంఫర్ట్ ఉందని స్పష్టం చేశారు. ఇక ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్కీ భాస్కర్ 2' ప్రాజెక్ట్ ఆలోచన ఉందనీ, అయితే దానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ధనుష్‌తో కాప్ డ్రామా చేసే ప్లాన్స్ ఉన్నాయని, సిద్దు జొన్నలగడ్డతో ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని వెంకీ గుర్తు చేసుకున్నారు. "తొలిప్రేమ" సమయం నుంచే చిరంజీవి గారు తనను ఎంతగానో ప్రోత్సహించారని, 'లక్కీ భాస్కర్' చూసిన తర్వాత కూడా స్వయంగా ఇంటికి పిలిపించి అభినందించారని తెలిపారు. "నా దగ్గరకు వచ్చి న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు.. కలిసి చేద్దాం" అని చిరంజీవి గారు చెప్పడం తనకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు వెంకీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే చిరు లాంటి లెజెండరీ హీరోను డైరెక్ట్ చేయాలంటే తనకు మరికొంత అనుభవం కావాలని అభిప్రాయపడ్డారు.
Venky Atluri, Chiranjeevi, Lucky Baskhar, Vishwanath & Sons






