
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాల్లో 'శ్రీవారి ప్రియురాలు' (Srivari Priyuralu) ఒకటి. వినోద్ కుమార్, ఆమని, ప్రియరామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ సినిమా ప్రేమికుల హృదయాల్లో నిలిచే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్ లో భర్త ప్రవర్తనను, అతను ఉన్న పరిస్థితిని చూసి భార్యగా ఆమని పడే ఆవేదన, కళ్ళల్లో వ్యక్తమయ్యే నిస్సహాయత ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తోంది. ఏ భార్య కూడా తన భర్తను చూడకూడని స్థితిలో చూసినప్పుడు కలిగే ఆ ఘోరమైన అనుభూతిని ఈ సన్నివేశంలో అద్భుతంగా చూపించారు.
ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ సీన్ లో.. వినోద్ కుమార్, ప్రియరామన్ ల మధ్య ఉన్న సంబంధాన్ని ఆమని కళ్లారా చూస్తుంది. ఇద్దరూ ఒకే బెడ్ పై పడుకొని ఉండటం చూసి షాక్ అవుతుంది. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించే హావభావాలు, ఆవేదన సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. నటిగా ఆమని తన నటనతో ఈ సీన్ కి ప్రాణం పోశారని చెప్పవచ్చు.
ఆ ఆవేదనతో రోడ్డు మీద వెళ్తున్న ఆమనిని కొందరు రౌడీలు అల్లరి పెడతారు. దాంతో దుర్గమ్మలా ఆవేశంతో పెద్ద కర్ర తీసుకొని వారిని కొడుతుంది. "మీ బతుకులు చెడ. మీ ఇళ్ళకాడ మీ పిల్లలు ఎదురు చూస్తుంటే.. మీకు రోడ్డున పోయేవాళ్లు కావాలంట్రా" అంటూ ఆమని చెప్పే మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి.
మరుసటి రోజు వినోద్ కుమార్ కూడా భార్యకు దొరికిపోయిన భర్తగా, తన తప్పును ఒప్పుకుంటూ మాట్లాడే డైలాగులు ఎంతో సహజంగా ఉంటాయి. "రాత్రి నువ్వు హాస్పిటల్ కి వచ్చావు.. మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశవు" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఈ సీన్ లోని గాంభీర్యాన్ని, బాధను రెట్టింపు చేస్తుంది.
పాత సినిమాల్లోని ఇటువంటి ఎమోషనల్ కంటెంట్ కి ఎప్పటికీ క్రేజ్ తగ్గదని ఈ వీడియోకి వస్తున్న వ్యూస్, లైక్స్ ని చూస్తే అర్థమవుతోంది. నేటి తరం డిజిటల్ ఆడియన్స్ సైతం ఈ క్లాసిక్ సీన్ కి ఫిదా అవుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఇటువంటి గొప్ప ఎమోషనల్ డ్రామాలను మళ్ళీ చూడలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.





