
భారతీయ సినీ రంగాన్ని దశాబ్దాల పాటు తన అసాధారణమైన అభినయంతో ఏలిన లెజెండరీ నటి 'షావుకారు జానకి' కన్నుమూశారు. 1950లో వచ్చిన 'షావుకారు' సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె, తొలి చిత్రంతోనే ఆ పేరును తన ఇంటిపేరుగా మార్చుకుని సంచలనం సృష్టించారు.
1950ల కాలంలో ఒక సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, వెండితెరపై అంతటి విజయాన్ని సాధించడం అంటే మాటలు కాదు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'షావూకారు' సినిమాతో జానకి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో 'సుబ్బులు' అనే పాత్రలో ఆమె చూపించిన అభినయం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
'షావుకారు' సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి, అలాగే ఆ సినిమా పేరు జానకి ఇంటిపేరుగా మారడానికి ప్రధాన కారణం.. ఆ కథలో ఉండే ఆ అమాయకత్వం, కుటుంబ బంధాల మధ్య నలిగిపోయే ఎమోషన్, అలాగే ఆ పాత్రలో జానకి ఒదిగిపోయిన తీరు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులు ఆమెను సొంతంటి అమ్మాయిలా దత్తత తీసుకున్నారు. అందుకే జానకి కాస్తా.. 'షావూకారు జానకి'గా మారిపోయారు!
ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'కన్యాశుల్కం', 'మంచి మనసులు', 'డాక్టర్ చక్రవర్తి' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ భాషల్లోనూ వందలాది సినిమాల్లో నటించి, ప్రతి ఇంటా ఒక కుటుంబ సభ్యురాలిలా నిలిచారు. గ్లామరిజానికి మాత్రమే పరిమితం కాకుండా, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటనకు ఒక కొత్త అర్ధాన్ని ఇచ్చారు.
తెలుగు చిత్రసీమలో ఒక స్వర్ణ యుగానికి ముగింపు పడుతూ ఆమె సెలవు తీసుకున్నా.. 'షావుకారు' నుంచి మొదలైన ఆమె సినీ ప్రయాణం ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో పచ్చగానే ఉంటుంది.
Click Here: Shavukaru Full Movie
Sowcar Janaki, Shavukaru Janaki, Shavukaru Movie





