
తెలుగు సినిమా చరిత్రలో స్నేహం నేపథ్యంగా వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే కాలం గడిచినా గుండెల్లో అలానే నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ చిత్రమే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'స్నేహం కోసం'.
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయంతో మెప్పించారు. ముఖ్యంగా తండ్రి పాత్ర అయిన 'చిన్నయ్య'గా ఆయన పండించిన నటన, భావోద్వేగాలు ఎప్పటికీ మరువలేనివి. స్నేహానికి ప్రాణమిచ్చే ఒక నిఖార్సయిన స్నేహితుడిగా చిరంజీవి ఈ చిత్రంలో జీవించారనే చెప్పాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్ర క్లైమాక్స్ వీడియో చూస్తే ఎంతటి వారికైనా కన్నీళ్లు ఆగవు. తన ప్రాణ స్నేహితుడి కుటుంబం బాగుండాలని, స్నేహితుడి అల్లుడు చేసిన తప్పును తనపై వేసుకుని జైలుకు వెళ్తాడు చిన్నయ్య. ఈ నిజం తెలియని స్నేహితుడి కూతురు (మీనా) ఇన్నాళ్లూ చిన్నయ్యను తప్పుగా అర్థం చేసుకుంటుంది.
చివరికి అసలు నిజం బయటపడే ఆ సన్నివేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగుతుంది. "మన అమ్మను చంపింది ఆయన కాదమ్మా.. నా భర్తే" అంటూ సితార తన తన చెల్లెలు మీనాకి నిజం చెప్పే సీన్ సినిమాకే హైలైట్. అన్నం పెట్టిన విశ్వాసంతో తన భర్త చేసిన హత్యను చిన్నయ్య తన మీద నింద వేసుకొని శిక్ష అనుభవించాడని తెలుసుకుని అందరూ షాక్ అవుతారు.
ఇక ప్రకాష్ రాజ్ తన భార్య(సితార)ను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించగా, చిన్నయ్య అడ్డుగా వెళ్తాడు. దాంతో ఆ కత్తి చిన్నయ్య పొట్టలో దిగుతుంది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ను ఏం చేయకుండా వదిలేస్తాడు. గౌరమ్మ(సితార) సుమంగళిగా ఉండాలనే ఉద్దేశంతోనే, చంపకుండా వదిలేస్తున్నట్లు చెప్పే డైలాగ్స్ చిరంజీవి నటనలోని ఇంటెన్సిటీని చూపిస్తాయి.
తండ్రి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో కదిలిస్తుంది. ప్రాణాలు పోయే స్థితిలో కూడా తన స్నేహితుడు పెద్దయ్యను జాగ్రత్తగా చూసుకోమని కొడుక్కి చెప్తాడు చిన్నయ్య.
అలాగే తనను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీనా క్షమాపణలు అడిగే సీన్ కూడా హృదయాన్ని హత్తుకుంటుంది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెంటిమెంట్ సినిమాల్లో ఒక మైలురాయి.
ముఖ్యంగా ఈ క్లైమాక్స్ సీన్ చూసిన నెటిజన్లు మెగాస్టార్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటి తరం కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి స్వచ్ఛమైన స్నేహం, కుటుంబ బంధాలను చూసే అవకాశం తక్కువైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం 'స్నేహం కోసం' క్లైమాక్స్ సీన్ ఒక ఎవర్‌గ్రీన్ ఎమోషనల్ క్లాసిక్‌గా నిలిచిపోతుంది.
Chiranjeevi, Sneham Kosam, Climax Scene, Emotional, TeluguOne




