
చిత్రసీమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఒక అసాధారణమైన ప్రయాణం. నేడు(జూలై 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజా ది రాజా' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైనా యువ హీరో రుత్విక్ కొండకిండి తన సుదీర్ఘ పోరాటాన్ని, సినిమాపై ఉన్న ఫ్యాషన్‌ను 'తెలుగువన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
డాక్టర్స్ కుటుంబం నుండి వచ్చిన రుత్విక్, బీబీఏ మార్కెటింగ్ చదివినప్పటికీ నటనపై ఉన్న బలమైన అభిరుచితో సినిమా వైపు అడుగులు వేశారు. ఫస్ట్ క్లాస్ నుంచే స్కూల్ వేదికలపై నాటకాల్లో చురుగ్గా పాల్గొన్న రుత్విక్, ఇంగ్లీష్ షేక్‌స్పియర్ నాటకం 'ది మర్చంట్ ఆఫ్ వెనిస్'లో డ్యూక్ పాత్రను పోషించి నటనలోని లోతులను ఆస్వాదించారు. నటుడిగా రాణించాలనే బలమైన కోరికతో ఏకంగా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో రెండు సంవత్సరాల పాటు నటనలో శిక్షణ పొందారు. అక్కడ బాలీవుడ్ స్టార్ కపూర్ వారసులు, తమిళ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్, 'మేడ్ ఇన్ హెవెన్' ఫేమ్ అర్జున్ రాధాకృష్ణ వంటి ప్రతిభావంతులు తనకు క్లాస్‌మేట్స్‌గా ఉండటం విశేషమని గుర్తుచేసుకున్నారు.
శిక్షణ పూర్తి చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రుత్విక్‌కు తొలి రోజుల్లో తీవ్రమైన నిరాశే ఎదురైంది. కొత్తవాడు కావడంతో ఏ ఒక్క నిర్మాత కూడా కనీసం ప్రోత్సహించలేదు సరికదా అనేక అవమానాలకు గురిచేశారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్లు ఇచ్చారు. ఆ సమయంలో తండ్రి ఇచ్చిన సలహాతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఒక అమ్మాయి అబ్బాయిగా, మళ్లీ తిరిగి అమ్మాయిగా మారే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ షార్ట్ ఫిల్మ్ దాదాపాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్ కావడంతో రుత్విక్‌కు ఇండస్ట్రీలో తొలి విజయం, ఆత్మవిశ్వాసం లభించాయి. నటుడిగా నిరూపించుకోవడానికి దాదాపు 11 స్క్రిప్ట్‌లు విన్న తర్వాత 'రాజా ది రాజా' ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ పాత్ర కోసం ప్రత్యేకంగా హోంవర్క్ చేసి ఆ పాత్రలో ఒదిగిపోయారు.
ఇప్పుడున్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే తనకు ఇష్టమని రుత్విక్ తెలిపారు. వాళ్లంతా ఎంతో కష్టపడుతున్నారని, అదే స్పూర్తితో తాను కూడా ప్రేక్షకులను అలరించాలి అనుకుంటున్నానని చెప్పారు.
ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు నరేష్, రోహిణి వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని రుత్విక్ తెలిపారు. సెట్స్‌లో నరేష్ గారు ఎంతో జోవియల్‌గా ఉంటూ మొదటి డైలాగ్ చెప్పేటప్పుడే కంఫర్ట్‌బుల్ చేశారని, అలాగే రోహిణి గారితో సినిమా షూటింగ్ సమయంలో ఉన్న ఎన్నో అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
కేవలం సినిమా రొటీన్ ఫార్ములాతో కాకుండా 15 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను ఒక యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాను రుత్విక్ సోదరి స్వయంగా నిర్మించడం విశేషం. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, కొత్త నటులను ప్రోత్సహించాలని రుత్విక్ కొండకిండి ఆశాభావం వ్యక్తం చేశారు.
Raja The Raja Movie, Ruthvik Kondakindi, Interview, TeluguOne






