Home

»

Exclusive Movie News

అల్లు అర్జున్ 250 కోట్ల రెమ్యునరేషన్ వెనుక అసలు నిజం.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.!

Jul 17, 2026 3:04PM

టాలీవుడ్‌లో హీరోల రెమ్యునరేషన్స్ గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఒక పెద్ద డిబేట్ నడుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత కొందరు హీరోల పారితోషికం వందల కోట్లకు చేరిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప' చిత్రం తర్వాత ఏకంగా రూ. 250 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్త సినీ సర్కిల్స్ లో విపరీతంగా హల్ చల్ చేసింది. ఈ హాట్ టాపిక్‌పై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు.

సమాజంలో ఏ పనీ లేని నాలాంటి వాళ్ళు అల్లు అర్జున్ రూ. 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని మాట్లాడుకుంటారని, కానీ అందులో అసలు నిజం వేరే ఉందని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అంత మొత్తాన్ని నేరుగా పారితోషికంగా తీసుకోలేదని, అది పూర్తిగా సినిమా లాభాల్లో ఆయనకు దక్కిన వాటా (షేర్) అని వెల్లడించారు. 'పుష్ప' చిత్రం సాధించిన భారీ విజయం వల్లే ఆయనకు రూ. 250 కోట్లు దక్కాయని, అదే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయి ఉంటే ముందుగా ఇచ్చిన రూ. 10 కోట్లో, రూ. 20 కోట్లో లేదా రూ. 30 కోట్లో మాత్రమే వచ్చి ఉండేవని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే మిగిలిన అమౌంట్ పూర్తిగా జీరో అయిపోయేదని, అందుకే హిట్ సాధించిన క్రెడిట్‌తో వచ్చిన ఆ లాభాల వాటాను నేరుగా రెమ్యునరేషన్ అనడం సరికాదని ఆయన విశ్లేషించారు.

ఇదే క్రమంలో గత తరం నటుల పారితోషికాలను, నేటి తరం హీరోల డిమాండ్లను తమ్మారెడ్డి భరద్వాజ పోల్చి చూపిస్తూ విమర్శలు గుప్పించారు. తన కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి గారికి తానే స్వయంగా రూ. 10,000 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సీనియర్లతో పోటీ పడి చిరంజీవి ఎప్పుడూ ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదని, నిర్మాతల క్షేమాన్ని ఆలోచించి ఎంత ఇస్తే అంత తీసుకుని సినిమాలు చేశారని కొనియాడారు. కానీ నేటి తరం కొత్త హీరోలు మాత్రం కథ, దర్శకుడు, హీరోయిన్ ఎవరనే విషయాల కంటే ముందే రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభాస్ వంద కోట్లు తీసుకుంటున్నాడు కదా మాకు ఎంత ఇస్తారనే ధోరణి కొందరిలో కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, భారీ బడ్జెట్ సినిమాల పేరిట రూ. 500 కోట్లు, రూ. 600 కోట్లు ఖర్చు పెట్టి, ఆ డబ్బులు వెనక్కి రావడం లేదనే సాకుతో టికెట్ రేట్లు పెంచడాన్ని తమ్మారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తానే స్వయంగా గతంలో ప్రతి సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేవాడినని, కానీ ఇప్పుడు టికెట్ రేట్ల భారం వల్ల థియేటర్ వైపు వెళ్లడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఒక సామాన్యుడు ఒంటరిగా సినిమా చూడటానికి థియేటర్ కు వెళితే టికెట్ ధర రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంటోందని, దానికి ట్రాన్స్‌పోర్టేషన్, పార్కింగ్, ఇంటర్వెల్ స్నాక్స్, భోజనం అన్నీ కలిపి కనీసం రూ. 1,000 ఖర్చవుతోందని లెక్కలతో సహా వివరించారు. ఇంత భారీ ఖర్చు భరించలేక ప్రేక్షకులు నెమ్మదిగా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నిజానికి పెద్ద సినిమాలకు పెట్టే పెట్టుబడిలో దాదాపు 80 శాతం రికవరీ నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే పూర్తవుతుందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. డిజిటల్ ఓటీటీ హక్కుల ద్వారా 50 శాతం, డబ్బింగ్ హక్కుల ద్వారా 20 శాతం, ఓవర్సీస్ హక్కుల ద్వారా 10 శాతం రికవరీ అవుతుందని, థియేట్రికల్ రన్ మీద కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే ఆధారపడతారని తెలిపారు. పెద్ద సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా మొదటి మూడు రోజులు థియేటర్లలో రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు సులభంగా రాబడుతున్నాయని, అలాంటప్పుడు సామాన్య ప్రేక్షకులను ఇంకా హింసించాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు పెంచడం ఎంతవరకు న్యాయమని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

 

 

Tammareddy Bharadwaja, Interview, Allu Arjun, Remuneration, Prabhas

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com