
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయానికి అటు ప్రేక్షకులు, ఇటు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) 'తెలుగువన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ వెనుక దాగున్న అనేక ఆసక్తికరమైన, షాకింగ్ నిజాలను పంచుకున్నారు.
సమంతకు ఈ సినిమాతో ఎలాగైనా ఒక భారీ హిట్టివ్వాలని ప్రముఖ సురేష్ బాబు ఎంతగానో తాపత్రయపడ్డారని ఆమె వెల్లడించారు. సినిమా ప్రారంభానికి ముందే సురేష్ బాబు గారు తనతో మాట్లాడుతూ.. "నందిని, నువ్వు సమంతకు ఈ సినిమాతో ఎలాగైనా ఒక పెద్ద హిట్ ఇప్పించాలి, నీ బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చెయ్" అని అన్నట్లు నందిని రెడ్డి గుర్తుచేసుకున్నారు. సమంతతో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా ఏమైనా సలహాలు కావాలంటే తనను సంప్రదించమని, తన అడ్వైస్ తీసుకోమని ఎప్పుడూ చెప్తుండేవారని నందిని రెడ్డి పేర్కొన్నారు.
అయితే, ఈ సినిమా ప్రయాణం అంత సులువుగా సాగలేదని, షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న ఆర్థిక మరియు మానసిక ఒత్తిళ్లను ఆమె విడమర్చి చెప్పారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొంతమంది ఫైనాన్షియర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి లాగాలని చూశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమాలో అసలు స్టార్ హీరోనే లేడు, కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సమంత బాక్సాఫీస్ పుల్ ఎంతవరకు ఉంటుంది? పోస్ట్ కోవిడ్ తర్వాత అసలు మహిళలు థియేటర్లకు వస్తున్నారా లేదా?" అంటూ ప్యూర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని నందిని రెడ్డి తెలిపారు.
సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం ఐదేళ్ల క్రితం ఘనవిజయం సాధించినప్పటికీ, ఇప్పటి మార్కెట్ పరిస్థితులు వేరంటూ నిరుత్సాహపరిచారని ఆమె అన్నారు. కానీ, తాము ఎలాంటి వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమా భారం పెంచకూడదనే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నామని, పక్కా ప్లానింగ్ తో అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేశామని స్పష్టం చేశారు.
అయితే సమంతకు హిట్టివ్వాలని సురేష్ బాబు తాపత్రయ పడినట్లు నందిని రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సమంత మొదట నాగ చైతన్యను వివాహం చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటిది నాగ చైతన్యకు మేనమామ అయిన సురేష్ బాబు.. సమంత సక్సెస్ కోరుకోవడం గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.






