
టాలీవుడ్ లో కామెడీ చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'కింగ్' సినిమా పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. దర్శకుడు శ్రీను వైట్ల మార్క్ కామెడీ, అక్కినేని నాగార్జున స్టైలిష్ ప్రజెన్స్ ఈ చిత్రాన్ని అప్పట్లో బ్లాక్‌బస్టర్ గా నిలబెట్టాయి.
ఈ సినిమాలో కథ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో, వినోదం అంతకు మించిన స్థాయిలో అలరిస్తుంది. ముఖ్యంగా రియల్ స్టార్ శ్రీహరి, మాస్టర్ భరత్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల పొట్టచెక్కలు చేస్తాయి.
అందులోనూ భరత్ గురువుగా, శ్రీహరి శిష్యుడిగా నటించిన పెయింటింగ్ క్లాస్ సీన్ ఇప్పటికీ మీమ్స్‌లో, సోషల్ మీడియా రీల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్లిప్‌ను ఒకసారి చూస్తే ఎంతటి వారైనా నవ్వకుండా ఉండలేరు.
ఇందులో శ్రీహరి 'జ్ఞానేశ్వర్' అనే రౌడీ పాత్రలో కనిపిస్తారు. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం పెయింటింగ్ వేస్తుంటారు. తాను రాత్రంతా కష్టపడి గీసిన ఒక పెయింటింగ్ ని మాస్టర్ భరత్ కి చూపిస్తూ దానికి "కరుణించిన ఆకాశం" అని పేరు పెట్టానని ఎంతో గంభీరంగా చెప్తారు.
ఆ పెయింటింగ్‌లో ఉన్న కుర్రాడికి ఆకలేస్తే నేల వంక, దాహమేస్తే ఆకాశం వంక చూశాడని, దాంతో ఆకాశం కరుణించి మూడు చుక్కల నీళ్లు రాల్చిందని శ్రీహరి ఇచ్చే బిల్డప్‌కు భరత్ ఆశ్చర్యపోతాడు.
అయితే అసలు కామెడీ అంతా పెయింటింగ్‌లో ఉన్న కుర్రాడికి చెవులు లేకపోవడం దగ్గరే మొదలవుతుంది. "వాడికి చెవులు ఏవిరా?" అని భరత్ అడగ్గా, "వాడు చెవిటోడు మాస్టార్, పెయింటింగ్‌లో చెవిటోడని ఎలా చూపిస్తాం.. అందుకే చెవులు తీసేశా" అని శ్రీహరి అమాయకంగా చెప్తారు.
దానికి భరత్ వెంటనే స్పందిస్తూ "చెవిటోడని చెవులు తీసేశావు. నీకు బుర్రలేదని నీ తలకాయ తీసేద్దామా..?" అంటూ ఇచ్చే పంచ్ డైలాగ్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించింది. 'కింగ్' సినిమాలోని ఈ కామెడీ సీన్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.
King Movie, Comedy Scenes, Srihari Comedy, Bharath Comedy





