Home

»

Exclusive Movie News

ఫస్ట్ హాఫ్ చూసేశా: అనిల్ రావిపూడి మూవీ స్టోరీ లీక్ చేసిన అనంత శ్రీరామ్.!

Aug 10, 2026 2:13PM

టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి రాబోయే చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2024 నుండి తాను వరుసగా అనేక ప్రాజెక్టులపై పనిచేస్తున్నానని, ఆ కష్టం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఆయన చెప్పారు. 

ముఖ్యంగా సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్‌తో కలిసి తాను 3 సినిమాలకు పనిచేస్తున్నట్లు తెలిపారు. వాటిలో 'శ్రీ శ్రీ', 'ఇరుముడి' చిత్రాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నవెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కూడా ఒకటి. 2027 సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, అనంత శ్రీరామ్ ఇచ్చిన తాజా అప్‌డేట్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

అనిల్ రావిపూడి సినిమా గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. "సంక్రాంతికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సబ్జెక్ట్ ఇది. ఇప్పటికే ఈ సినిమా కోసం నాలుగు పాటలు రాశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో జరగగా, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది. ఈ సినిమా రాయలసీమ కుటుంబాల నేపథ్యంలో ఉంటుంది." అని చెప్పారు.

ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావా బావమరుదులుగా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనిపై అనంత శ్రీరామ్ స్పందిస్తూ.. "ఇద్దరు స్నేహితులుగా కనిపిస్తారని.. ఒకరినొకరు బావ బావ అని పిలుచుకుంటారు." అంటూ క్లారిటీ ఇచ్చేశారు. 

అనిల్ రావిపూడికి వేగంగా సినిమాలు చేస్తారనే పేరుంది. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ ను కూడా అంతే జెట్ స్పీడ్ లో చేస్తున్నారని అనంత శ్రీరామ్ తెలిపారు. "రీసెంట్ గా ఫస్ట్ హాఫ్ చూశాను. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మకంగా చెబుతున్నాను." అన్నారు. అప్పుడే ఫస్ట్ హాఫ్ లాక్ అయిందంటే.. రావిపూడి స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.

 

 

Anantha Sriram, Interview, Anil Ravipudi, Venkatesh, Kalyan Ram

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com