
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యానికి బ్రహ్మానందం, శ్రీలక్ష్మిల కాంబినేషన్ ఒక కేరాఫ్ అడ్రస్. వీరిద్దరూ వెండితెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయం. తాజాగా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీరిద్దరి కల్ట్ కామెడీ సీన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బ్రహ్మానందం 'గురునాథం' అనే అమాయకపు ఆఫీస్ ఉద్యోగిగా నటించగా, శ్రీలక్ష్మి ఆయనకు భార్యగా 'సత్య వెంకట కామాక్షి' పాత్రలో తన చాదస్తంతో అల్టిమేట్ కామెడీని పండించింది. పెళ్లయి ఏళ్ళు గడిచినా భర్తను తన విచిత్రమైన పూజలు, నోములతో ఎలా ముప్పతిప్పలు పెట్టిందనే కథాంశంతో సాగే ఈ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది.
ఈ వీడియోలోని మొదటి సీన్ లోనే శ్రీలక్ష్మి తన పతిభక్తిని చాటుకునే క్రమంలో నిద్రిస్తున్న భర్త కాళ్ళ దగ్గర అగరుబత్తులు ముట్టించి, అవి అయిపోయేదాకా కాళ్ళు కదపకూడదని కండిషన్ పెడుతుంది. గురునాథం నిద్రలేచి చూసేసరికి కాళ్ళ దగ్గర పొగలు రావడం చూసి షాక్ అవుతాడు. "పెళ్ళిచూపుల్లో మీ నాన్న నా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువండీ అంటే సర్లే అనుకున్నాను.. ఇలా సర్వాంగాలను సపరేట్ చేసి పూజ చేస్తావనుకోలేదు" అంటూ బ్రహ్మానందం తన మార్క్ డైలాగ్ డెలివరీతో కామెడీని పీక్స్ కి తీసుకెళ్లారు. అంతటితో ఆగని కామాక్షి, "వంటగదిలో పాయసం పెట్టాను, పాచి నోటితో పాయసం తాగితే పితృ దేవతలకు మంచిదట" అని చెప్పినప్పుడు బ్రహ్మానందం ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం. భార్య పెట్టే ఈ చాదస్తపు పూజల బాధలు తట్టుకోలేక ఆఫీసులో బెంచ్ కింద దాక్కునే సీన్ హైలైట్ గా నిలిచింది.
ఇక మరో సీన్ లో భార్యను 6 ఏళ్ల తర్వాత ఎలాగైనా ఒక సోషల్ సినిమాకు తీసుకెళ్లాలని గురునాథం ప్లాన్ చేస్తాడు. కానీ కామాక్షి మాత్రం తాను వస్తే శ్రీకృష్ణ లీలలు, స్వామి అయ్యప్ప మహిమ వంటి భక్తి సినిమాలకే వస్తానని మొండికేస్తుంది. చివరకు భర్త బలవంతం మీద ఒప్పుకుని, రిక్షాలో సినిమాకు బయలుదేరుతుంది. అయితే థియేటర్ కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన కనపడిన వస్తువులన్నీ కొంటూ గురునాథం జేబుకు చిల్లు పెడుతుంది. మొదట 20 రూపాయల ప్లాస్టిక్ బుట్ట, ఆ తర్వాత 50 రూపాయల బకెట్, చివరగా 30 రూపాయల చీపురు కట్టలు కొంటూ రిక్షాలోనే సంత పెట్టేస్తుంది. చివరకు చెప్పు తెగిపోయిందని దాన్ని కుట్టించుకోవడానికి వెళ్లడంతో బ్రహ్మానందం రోడ్డుపై రిక్షాలో సామాన్ల మధ్య కూర్చుని తల పట్టుకుంటాడు. "మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు" అంటూ ఆయన పడే ఆవేదన ప్రతి భర్తకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
వీడియో చివరలో వచ్చే ట్విస్ట్ మరింత హాస్యాన్ని పండిస్తుంది. ఆఫీసులో ఉండే రాంబాబు అనే సహోద్యోగి పెళ్లి పంతం కోసం గురునాథం భార్య మెడలోని మంగళసూత్రాన్ని కాసేపు అప్పుగా అడుగుతాడు. భర్త మాట విని కామాక్షి తన మెడలోని తాళిని తీసి ఇస్తూ, "నేను కట్టిన తాళి మళ్ళీ నా మెడలో పడేవరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యను కాదు.. కాస్త తప్పుకుంటారా గురునాథం గారు" అని పరాయి వ్యక్తిలా మాట్లాడటంతో బ్రహ్మానందం నోరెళ్లబెడతాడు. మొత్తానికి ఈ వింటేజ్ కామెడీ వీడియో సోషల్ మీడియాలో మరోసారి నవ్వుల జాతర సృష్టిస్తోంది.
Brahmanandam, Sri Lakshmi, Telugu Comedy Scenes





