
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు.. ప్రతీ భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. మన తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప దేశభక్తి సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
తెలుగు దేశభక్తి సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు'. ఈ సినిమా పేరు వినగానే "తెలుగు వీర లేవరా.." పాట మన నరనరాల్లో పూనకాలు తెప్పిస్తుంది. మన్యం విప్లవ వీరుడి పోరాటాన్ని, నాటి బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఒక ట్రెండ్ సెట్టర్. నేటికీ ఈ సినిమా చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
అలాగే నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలి పులి', 'మేజర్ చంద్రకాంత్' చిత్రాలు అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ చెప్పిన ఆవేశపూరితమైన డైలాగ్స్ విని.. థియేటర్లలో జనాలు పూనకాలతో ఊగిపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆ సినిమాలు సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాయి.
ఆ తర్వాత కాలంలో.. అక్కినేని నాగార్జున నటించిన "ఆజాద్" సినిమా కూడా జనాల్లో దేశభక్తి ఆలోచనలను రగిల్చింది. ముఖ్యంగా దేశభక్తి అనగానే మన కళ్లముందు మెదిలే మరో అద్భుతమైన సినిమా 'ఖడ్గం'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం.. మతం కంటే, ప్రాంతం కంటే 'మనం భారతీయులం' అనే భావన ఎంత గొప్పదో పవర్‌ఫుల్‌గా చూపించింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే.. టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు ఎందరో ఉంటారు.
ఇక మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'RRR'కి కూడా దేశభక్తి సినిమాల్లో ప్రత్యేక స్థానముంటుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించిన తీరు, వారిద్దరి మధ్య స్నేహం, బ్రిటిష్ అధికారులపై వారు జరిపిన పోరాటం.. థియేటర్లలో ప్రతీ ఒక్కరికీ రొమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి.
వీటితో పాటు "భారతరత్న, హనుమంతు, రాజన్న, ఘాజీ, సైరా నరసింహారెడ్డి, మేజర్" వంటి దేశభక్తి సినిమాలు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
Independence Day, Alluri Seetarama Raju, Khadgam, RRR





