Home

»

Exclusive Movie News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్.. బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ 

Jun 30, 2026 2:21PM

 

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్((Pawan Kalyan)ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన తాజా వార్త ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గత కొంతకాలంగా భుజాల నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, నిన్న తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 


ఈ పరీక్షల్లో పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ (Rotator Cuff) తీవ్రంగా గాయపడినట్లు, కండరాలు చిట్లినట్లు (Muscle Tear) వైద్య నిపుణులు నిర్ధారించారు. దీంతో ఆయనకి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని ముంబై వైద్య బృందం ఖచ్చితంగా సూచించింది. అయితే, తన వ్యక్తిగత ఆరోగ్యం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావించిన పవన్ కళ్యాణ్, ఈ అత్యవసర సర్జరీని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాలనాపరమైన బాధ్యతలు సజావుగా పూర్తయిన తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన ధైర్యంగా నిర్ణయించుకోవడం విశేషం.

పవన్ కళ్యాణ్ భుజాల గాయం, సర్జరీ వార్త బయటకు రాగానే ఆయన అభిమాని, భక్తుడు  ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆరాధ్య దైవానికి సంఘీభావం తెలుపుతూ ఆయన చేసిన  ఎమోషనల్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. "నిన్న రాత్రంతా నాకు అస్సలు నిద్ర రాలేదు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వస్తేనే మనిషి విలవిల్లాడిపోతాడు, అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ భరించలేని శారీరక బాధని  చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం అంటూ బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ 2012 నాటి బ్లాక్‌బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' మూవీ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో గుజరాత్‌లో జరిగిన ఒక ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గుర్రం పైనుంచి పడిపోయారని, అప్పట్లోనే వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని హెచ్చరించినా  వినలేదు. నిర్మాతకి  నష్టం రాకూడదు, వందలాది మంది కార్మికులు ఇబ్బంది పడకూడదు అని మీరు ఆ నరకయాతనని  గుండెల్లోనే దాచుకుని షూటింగ్ పూర్తి చేశారు. సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఆ రోజు మీరు నాకు కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే ఇవ్వలేదు.. ఏ జన్మలోనూ తీర్చుకోలేని కృతజ్ఞతా రుణం ఇచ్చారు. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎందరో జీవితాలను నిలబెట్టిన రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఆయన అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు, ప్రశాంతతని  ప్రసాదించాలని బండ్ల గణేష్ ప్రార్థించారు.

మరోవైపు, పవన్  హెల్త్ అప్‌డేట్ విన్న జనసైనికులు, పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'గెట్ వెల్ సూన్ అన్నయ్య' అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో వేలాదిగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఇటీవలే సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ సీక్వెల్ 'OG 2' (ఓజీ 2) స్క్రిప్ట్ వర్క్ దాదాపు 70 శాతం పూర్తయిందని, నవంబర్ తర్వాత మూవీ సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవతో పాటు   వెండితెరపై 'ఓజీ'గా అడుగుపెట్టాలని రెండు రాష్ట్రాల ప్రజలు, సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com