Home

»

Exclusive Movie News

ఒకే ఏడాది 18 సినిమాలు.. ఆ రికార్డ్ ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాలేదు!

Jul 3, 2026 3:55PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్‌స్టార్' అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు కృష్ణ. సాహసాలకు మారుపేరుగా నిలిచిన ఆయన, ఇండస్ట్రీలో ఎన్నో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయా స్టూడియోస్ అధినేతగా తెలుగు సినిమా స్థాయిని పెంచారు. తాజాగా కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు 'తెలుగువన్' ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని, అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని, ఆ రోజుల్లో కృష్ణ పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. (Adiseshagiri Rao Interview)

ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, తమ మధ్య రిలేషన్ ఎప్పుడూ చాలా ఓపెన్‌గా ఉండేదని చెప్పారు. ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఎంత పెద్ద రిస్క్ ఉన్నా, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. ఏదైనా విషయంలో అన్నయ్య ఫైనల్ డెసిషన్ తీసుకుంటే.. ఇక దానికి తిరుగుండేది కాదని, అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. కృష్ణ గారికి అసలు కోపమే వచ్చేది కాదని, అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాల కాలంలో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ.. కృష్ణ వారికి గట్టి పోటీనిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా 1972వ సంవత్సరంలో కృష్ణ ఏకంగా 18 సినిమాలు విడుదల చేశారని ఆదిశేషగిరిరావు గుర్తు చేశారు. ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు రిలీజ్ కావడం అనేది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు అని, ఇది మరెవరికీ సాధ్యం కాలేదని అభిప్రాయపడ్డారు.

ఆ రోజుల్లో కృష్ణ గారు డే అండ్ నైట్ విరామం లేకుండా పని చేసేవారని ఆదిశేషగిరిరావు వివరించారు. ఒక్కోసారి రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా షూటింగ్స్‌లో పాల్గొనేవారట. ఒకే స్టూడియోలో ఉన్న నాలుగైదు ఫ్లోర్లలో కృష్ణ గారికి సంబంధించిన వేర్వేరు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరిగేవని, అలసట అనేది లేకుండా ఆయన ఒక సెట్ నుండి మరో సెట్‌కి వెళ్తూ కష్టపడ్డారని చెప్పారు. అయితే ప్రతిష్టాత్మక 'అల్లూరి సీతారామరాజు' సినిమా తర్వాత నుండి ఆయన తన పని వేగాన్ని తగ్గించి, రోజుకు ఒకే షిఫ్ట్ చొప్పున షూటింగ్స్ చేయడం ప్రారంభించారని తెలిపారు.

కృష్ణని ఇండస్ట్రీలో అందరూ 'మంచి మనిషి' అని ఎందుకు అంటారో కూడా ఆదిశేషగిరిరావు వివరించారు. నిర్మాతల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, కృష్ణ గారు రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ పట్టుబట్టలేదని చెప్పారు. సినిమా ప్లాప్ అయితే నిర్మాతల బాధను అర్థం చేసుకుని, ఎన్నో సినిమాలకు ఆయన తన రెమ్యునరేషన్‌ను వదులుకున్నారని తెలిపారు.

ప్రస్తుత తరం నటీనటులపై ఆదిశేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో సొంత డబ్బులు పెట్టి సినిమాలు తీసే హీరోలు ఎవరూ లేరని, అందరూ పార్ట్‌నర్‌షిప్‌లలోనే చేస్తున్నారని అన్నారు. ఏ రోజైనా సరే, ఒక నటుడు లేదా దర్శకుడు తన సొంత డబ్బు పెట్టి సినిమా తీస్తేనే.. అందులో ఉండే అసలైన కష్టం ఏంటో తెలుస్తుందని, అప్పుడే వారికి సినిమా విలువ పూర్తిగా అర్థమవుతుందని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు.

ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమ అభిమాన నటుడి గొప్పతనాన్ని, ఆయన పరిశ్రమకు చేసిన సేవలను నెటిజన్లు కామెంట్ల రూపంలో కొనియాడుతున్నారు.

 

 

Super Star krishna, Adiseshagiri Rao, Interview, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com