Home

»

Exclusive Movie News

ఏ పువ్వు ఏ తేటిదన్నది: 'ఆకాశం ఏనాటిదో' పాటలో.. ఆత్రేయ రాసిన ఆ లైన్లకు అర్థం తెలుసా.?

Sep 12, 2026 12:57PM

‘ఆకాశం ఏనాటిదో... అనురాగం ఆనాటిది’ అనే పాట విన్న ప్రతిసారీ గుండెల్లో ఏదో తెలియని అనుభూతిని కలుగుతుంది. భానుచందర్, అర్చన జంటగా బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982లో వచ్చిన 'నిరీక్షణ' సినిమాలోది ఈ గీతం. మాస్ట్రో ఇళయరాజా సంగీతం, ఆచార్య ఆత్రేయ కలం నుంచి జారిన అద్భుత సాహిత్యం, ఎస్. జానకి గాత్ర అమృతం.. ఈ మూడూ కలిసి సృష్టించిన ఆ కావ్య సౌందర్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

ఈ పల్లవితోనే పాట మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తుంది. అసలు ప్రేమ అనే భావానికి అంతం కానీ, ప్రారంభం కానీ ఉందా? ఆకాశానికి ఎలాగైతే పుట్టుక ఎప్పుడో తెలియదో, మనుషుల మధ్య ఉండే అనురాగం కూడా అంతే సనాతనమైనది, ప్రాచీనమైనది. కానీ ఆ అనురాగం ఎంతటి లోతైనదో, ఎంతటి బలమైనదో ఎప్పుడు తెలుస్తుంది? మన మనసులో ప్రేమ అనే 'ఆవేశం' లేదా ఒక తీవ్రమైన భావోద్వేగం కలగినప్పుడే... ఆ ప్రేమ పరిమాణం ఏంటో అనుభవపూర్వకంగా బోధపడుతుంది అని ఆత్రేయ సరళమైన మాటలతో గొప్ప తత్వాన్ని చెప్పారు.

ఇక మొదటి చరణంలో ప్రకృతికి, మనసుకి ఉన్న బంధాన్ని వర్ణిస్తూ..

ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవిచూడమనగా

పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలదెను

ఏ పువ్వు మీద ఏ తుమ్మెద వాలాలో, ఏ జంట కలవాలో ఆ బ్రహ్మ ఎప్పుడో రాసిపెట్టాడట! విధి వ్రాసిన ఆ బంధం, వయసు ఇచ్చే పరవశంలో ఎంతటి శృంగారాన్నీ, ప్రణయాన్నీ నింపుతుందో కళ్ళకు కట్టినట్లు రాశారు. జానకి గారి స్వరంలో వ్యక్తమయ్యే ఆ సన్నని మురిపెము, ఆలాపన వింటుంటే వినేవారికి మేనిమి పులకింత కలగక మానదు.

రెండో చరణంలోకి వెళ్తే... ప్రేమ యొక్క దాహాన్ని, జీవన పరమార్థాన్ని తట్టిలేపుతారు.

ఏ మేఘం ఏ వానచినుకై
చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున
ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల
కలబోసి మరపించమనగా
కౌగిలిలో చెరవేసి మదనుని
కరిగించీ గెలిపించమనగా

మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

మేఘం కురిసే వాన చినుకు నేలను తాకి ఒక కొత్త ప్రాణానికి జన్మనిచ్చినట్లే, గుండె లోతుల్లో నుంచి వచ్చే రాగం ఒక కొత్త గీతాన్ని ఆవిష్కరిస్తుంది. హృదయాల తెరలు తీసి, రెండు తనువులు ఒకటైపోతున్న వేళ... సమయాన్నే ఆపేసి, కలలకు వెలలేని విలువ ఇవ్వాలని కోరుకుంటుంది ఈ పాట. కాలం ఆగిపోవాలి, కానీ ఆ అనురాగ బంధం శాశ్వతంగా ఉండిపోవాలి అనే తపన ఇందులో కనిపిస్తుంది.

బాస్ గిటార్, ఫ్లూట్, అద్భుతమైన స్ట్రింగ్స్ కలయికతో ఇళయరాజా అందించిన ఆ ఆర్కెస్ట్రేషన్.. దర్శకుడు బాలు మహేంద్ర దృశ్య కావ్యం మన కళ్ళముందు మెదులుతుంది. దశాబ్దాలు మారినా, కొత్త తరాలు వచ్చినా 'ఆకాశం ఏనాటిదో' పాట ఇచ్చే అనుభూతి ఎప్పటికీ చెరిగిపోదు.

 

 

 

 

[Aaskasam Eenatido Song, Telugu Lyrics, Ye Puvvu Ye Thetidannadi Song, Nireekshana Songs, Ilaiyaraaja, Acharya Aatreya, S Janaki, Telugu Songs]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com