Home

»

Exclusive Movie News

తెలుగు సినిమా డైలాగుల ప్రయాణం: ఏమంటివి ఏమంటివి నుండి నేటి మాస్ పంచ్‌ల వరకు!

Sep 12, 2026 7:23PM

 

ఒక స్కూల్ పిల్లోడు రోడ్ దాటి వెళ్తున్నాడు. ఏదో చిన్న పిల్లోడు కదా! పరిచయం లేకపోయినా 'రే బాబు జాగ్రత్త' అని అన్నాం. ఇక అంతే  'ఏమంటివి... ఏమంటివి' అని అన్నగారు ఎన్టీఆర్ లా గంభీరంగా రెచ్చిపోయి మాట్లాడతాడు. ఇలా ఎవర్ని కదిలించినా అగ్గి పెట్టుందా?  రాననుకున్నారా, రాలేననుకున్నారా? నీ ఇంటికొచ్చా నట్టింటికొచ్చా? అమ్మతోడు అడ్డంగా నరికేస్తా? నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది? ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్, తగ్గేదెలే, ఒక్కొకడ్ని కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకేసారి పంపించు..ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇలా ఎన్నో డైలాగ్స్ అవలీలగా చెప్పేస్తారు. ఇప్పుడు ఈ డైలాగ్స్ విన్నాక  ఒక్క క్షణం ఆలోచించండి... ఒక సినిమా మన గుండెల్లో ఏళ్ల తరబడి నిలిచిపోవాలంటే దానికి అసలైన ప్రాణం ఏంటి? గ్రాఫిక్సా? ఫైట్సా? కానే కాదు! థియేటర్లో సీటు అంచున కూర్చోబెట్టి, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే పవర్ ఫుల్ డైలాగ్స్ . తెలుగు సినిమాలో ఈ మాటల ప్రయాణం ఎలా మొదలైందో, ప్రేక్షకుల గుండెల్లో ఆ మాటలు ఎలా అగ్గి రాజేశాయో మీకు తెలుసా? 

తొలినాళ్లలో నాటక రంగ ప్రభావంతో పౌరాణికాలు, జానపదాలు ఏలాయి. అప్పట్లో పింగళి నాగేంద్రరావు గారు సృష్టించిన భాష ఒక మాయాజాలం! 'మాయాబజార్'లో ఆయన రాసిన 'హైందవము', 'జింబంబ' లాంటి పదాలు పండితుల నుంచి పామరుల వరకు ప్రతి ఒక్కరి నోళ్లలో నానాయి! ఆ తర్వాత ఎన్టీఆర్‌ గారు 'ఏమంటివి ఏమంటివి...' అంటూ సమాసాల సుడిగాలిలా చెప్పిన సుదీర్ఘ సంభాషణలు... థియేటర్లను ఈలల హోరుతో ఊపేసాయి! మాటంటే కేవలం భావం కాదు. ఒక ఆయుధం అని నిరూపించిన రోజులు అవి!"

కాలం మారింది... 80, 90లలో  'పరుచూరి బ్రదర్స్' అడుగుపెట్టారు! 350కి పైగా సినిమాలకి  సంభాషణలు రాసి, మాస్ హీరోల ఇమేజ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. 'రాజకీయాలు నా ఇంటి డోర్‌మ్యాట్'... 'అగ్గికి వానకి యుద్ధం వస్తే గెలిచేది ఎవరు?'... ఇలాంటి ఆవేశపూరితమైన పంచ్‌లతో ప్రతి సీన్‌ని హండ్రెడ్ వాట్ల బల్బులా వెలిగించారు! పరుచూరి అనే కాదు ఎం  విఎస్ హరనాధరావు, మరుదూరి రాజా, దర్శక రత్న దాసరి నారాయణరావు తో పాటు చాలా మంది తమ డైలాగ్స్ తో సినిమా రేంజ్ ని  పెంచారు. ఇక్కడ ముఖ్యంగా రెండు చిత్రాల్లో  వేరు వేరు సందర్భాల్లో వచ్చిన డైలాగ్స్ చెప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే సినిమా మొత్తం బాగోకపోయినా, బయటకొచ్చి సినిమా బాగుందని చెప్పేంత పవర్ ఫుల్ డైలాగ్స్.  తన బిడ్డ కడుపు నింపడం కోసం నిస్సహాయత లో ఉన్న ఒక స్త్రీ వేశ్య వృత్తి చేస్తూ పోలీసులకి  దొరుకుతుంది. జడ్జీ ఆమెతో 'పడుపు వృత్తి చేయడం తప్పు కదా' అని శిక్ష వేయడానికి సిద్దమవుతాడు. 

కథ, కథనం ప్రకారం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆమె ఏ మార్గం లేక తన బిడ్డ కోసం పడుపు వృత్తి  చేస్తుందనే విషయం తెలుసు. అంటే ప్రేక్షకుడు ఆమె పట్ల సానుభూతితో ఉన్నాడు. మరో పక్క జడ్జి చెప్పేది కూడా సమ్మతమే. దీంతో ఆమె జడ్జికి ఏమని సమాధానం చెప్తుందనే ఆతృతతో ప్రేక్షకులు  ఉంటారు. అప్పుడు ఆమె చాలా సింపుల్ గా 'ఎక్కడైనా కొనుగోలు ఉంటేనే, అమ్మకం ఉంటుందని చెప్తుంది. అంతే థియేటర్స్ మొత్తం ఈలలు కేకలు..చప్పట్లు. దాసరి పెన్ను నుంచి వచ్చిన మరో డైలాగ్ చూద్దాం..పోలీస్ కానిస్టేబుల్, అతని భార్య ఒక జిల్లా కలెక్టర్ ఫంక్షన్ కి వెళ్లారు. కలెక్టర్ భార్య కానిస్టేబుల్ కి ఫంక్షన్ లో రక రకాల పనులు చెప్తూ చాకిరీ చేయిస్తూ  ఉంటుంది. కానిస్టేబుల్ భార్య బాధపడుతుంటే కలెక్టర్ భార్య ఆమె దగ్గరకి వచ్చి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ' నీ మొగుడు నా మొగుడికి పనోడు అని చెప్తుంది. అప్పుడు కానిస్టేబుల్ భార్య' నిజమే నా మొగుడు నీ మొగుడుకి పనోడు, కానీ నీ మొగుడు ఈ జిల్లాకే పనోడు' అని చెప్తుంది. దీంతో ఈలలు, చప్పట్లు కొట్టానోడు పాపాత్ముడు అనుకునే పరిస్థితి.

 

 

 


Also Read: ది ప్యారడైజ్ స్టోరీ లీక్: అసలు కథ ఇదేనా?

2000ప్రారంభంలో 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు. పరుచూరి సోదరుల ఆవేశం స్థానంలో ఆలోచనని , తత్వాన్ని, చిరునవ్వుల ప్రాసలని  చేర్చారు! 'గెలిచినప్పుడు నవ్వేవాడు కాకుండా... ఓడిపోయినప్పుడు నవ్వేవాడే నిజమైన విజేత'...వంటి జీవిత సత్యాలతో పాటు, మనం రోజూ వాడే సాధారణ పదాలతోనే ప్రేక్షకులని  మంత్రముగ్ధులను చేయడం త్రివిక్రమ్  ప్రత్యేకం!" పూరి జగన్నాధ్,కొరటాల శివ, వెంకీ అట్లూరి కూడా మాటలకి పట్టాభిషేకం చేయడంలో సిద్దహస్తులు.

మరి నేటి ట్రెండ్ ఏంటి? ఇప్పుడు డ్రామా లేదు... అంతా రియలిస్టిక్! నేటి ట్రెండ్ చూస్తే, పౌరాణిక గంభీరత, ఆవేశపూరితమైన మాస్ పంచ్‌ల నుండి చాలా సహజమైన, రియలిస్టిక్ సంభాషణల వైపు తెలుగు సినిమా అడుగులు వేసింది. ఇప్పుడు ప్రేక్షకుడు కథతో పాటు ప్రయాణించాలంటే మాటలు డ్రామాటిక్‌గా కాకుండా, మన పక్కంటి వ్యక్తి మాట్లాడుతున్నట్లు చాలా నాచురల్‌గా ఉండాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాసలు  విరివిగా కనిపిస్తూ 100% స్థానికతని , నెటివిటీని అందిస్తున్నాయి. మాటలు ఎంత పదునుగా ఉంటే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత పెద్ద సంచలనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయిత ఎవరైనా, కాలం ఎంత మారినా... ప్రేక్షకుడి గుండెని తాకే డైలాగే ఎప్పటికీ టాలీవుడ్ అసలైన సింహాసనం.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com