బుచ్చిబాబు సినిమాకి బ్రేక్ పడినట్లేనా?
on May 20, 2022
'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమాకి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తన రెండో సినిమాని ఖచ్చితంగా తారక్ తో చేయాలన్న ఉద్దేశంతోనే 'ఉప్పెన' వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు బుచ్చిబాబు తన రెండో సినిమాని అనౌన్స్ చేయలేదని టాక్. తారక్ కెరీర్ లో 32వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని న్యూస్ వినిపిస్తోంది. తారక్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా 'NTR30', 'NTR31' అప్డేట్స్ వచ్చాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NTR30' ఈ జూలైలో స్టార్ట్ అవుతుండగా.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న 'NTR31' షూటింగ్ 2023 ఏప్రిల్ లో మొదలు కానుంది. ఈ లెక్కన తారక్ 32వ సినిమా 2024 లో స్టార్ట్ అయ్యే అవకాశముంది. అంటే ఇప్పటికే ఏడాదికి పైగా ఎదురుచూస్తున్న బుచ్చిబాబు.. మరో ఏడాదిన్నరకు పైగా ఎదురు చూడాలన్నమాట.
గతంలో డైరెక్టర్ సుజిత్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మొదటి సినిమా 'రన్ రాజా రన్'తో సూపర్ అందుకున్న సుజిత్.. రెండో సినిమాకే ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఆ సినిమా కోసం తను చాలాకాలం ఎదురుచూశాడు. మొదటి సినిమా 2014 లో విడుదలైతే ప్రభాస్ తో చేసిన రెండో సినిమా 'సాహో' 2019 లో విడుదలైంది. ఇప్పుడు బుచ్చిబాబు విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి సినిమా ఉప్పెన 2021 జనవరిలో విడుదల కాగా.. 'NTR32' 2025 లో విడుదలయ్యే అవకాశముంది. అయితే 'ఆర్ఆర్ఆర్'తో తారక్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇలాంటి టైములో తారక్ సినిమా కోసం ఎదురుచూసినా తప్పులేదని, ఆ ఎదురుచూపుకు తగ్గట్లు సినిమా హిట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి తారక్-బుచ్చిబాబు సినిమాపై సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.