తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా నటుడిగా సంచలనాలు సృష్టించిన దళపతి విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు కలుస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆయన విజయ్‌కు ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ముఖ్యమంత్రులను కలిసినప్పుడు విలువైన జ్ఞాపికలు, శాలువాలు లేదా విగ్రహాలు బహుమతిగా ఇవ్వడం చూస్తుంటాం. కానీ వెంకట్ ప్రభు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించారు. విజయ్‌తో కలిసి తాను చేసిన 'గోట్' (The Greatest Of All Time) సినిమాలోని ఒక ఆసక్తికరమైన వస్తువును ఆయనకు కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. 'గోట్' సినిమాలో హీరో విజయ్ వాడిన ఒక లగ్జరీ కార్ నంబర్ ప్లేట్. అవును, ఆ సినిమాలో విజయ్ నడిపే కారుకు 'TN 07 CM 2026' అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్ ఫోటోను చక్కగా ఫ్రేమ్ కట్టించి మరీ సీఎం విజయ్ చేతుల్లో పెట్టారు వెంకట్ ప్రభు. ప్రస్తుతం ఈ అరుదైన గిఫ్ట్‌కు సంబంధించిన పిక్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.
నిజానికి 'తమిళ వెట్రి కళగమ్' పార్టీని స్థాపించిన కొత్తలోనే విజయ్ 'గోట్' సినిమాలో నటించారు. ఆ సమయంలోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు భవిష్యత్తును ముందే ఊహించి, 2026 ఎన్నికల్లో విజయ్ గెలవడం ఖాయమని నమ్మారు. అందుకోసమే సినిమాలో కారు నంబర్‌లో 'CM 2026' వచ్చేలా డిజైన్ చేశారు. ఆయన ఊహించినట్లే ఎన్నికల ఫలితాల్లో విజయ్ ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
దీంతో వెంకట్ ప్రభు విజన్‌ను, ఆయన ముందే ఊహించిన తీరును కోలీవుడ్ వర్గాలు తెగ అభినందిస్తున్నాయి. తన మనసుకు నచ్చిన హీరో కమ్ సీఎంకు ఈ ప్రత్యేక జ్ఞాపికను అందించడంపై వెంకట్ ప్రభు సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ కూడా ఈ వెరైటీ గిఫ్ట్ చూసి ఎంతగానో మురిసిపోతూ, ఆనందంగా స్వీకరించారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటో బయటకు రాగానే దళపతి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "మా అన్న ఎప్పుడో సీఎం అవుతాడని డైరెక్టర్ ముందే ఫిక్స్ అయ్యాడు.. ఇదీ అసలైన విజన్ అంటే" అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. వెంకట్ ప్రభు మేకింగ్ లోనే కాదు, ఇలాంటి గిఫ్ట్‌లు ఇవ్వడంలోనూ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.





