ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త కంటెంట్‌తో వస్తున్న వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీ ప్రియుల్లో ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ఈ క్రమంలోనే విద్యావ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో వచ్చిన ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఇప్పుడు డిజిటల్ దునియాను ఊపేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు 'ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్'. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్, కేవలం వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 లిస్టులో ఏకంగా మూడో స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది.
ఈ సిరీస్ కథాంశం విషయానికి వస్తే.. నేటి పోటీ పరీక్షల ప్రపంచంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల తరబడి శ్రమించే అభ్యర్థుల జీవితాలు ఒకే ఒక్క పేపర్ లీకేజీతో ఎలా రోడ్డున పడుతున్నాయనేది హార్ట్ టచింగ్‌గా ఆవిష్కరించారు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కొందరు చేసే మోసాలు, ఈ నెట్‌వర్క్ వెనుక ఉండే పెద్ద తలకాయలు ఎవరనే కోణంలో కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ సిరీస్‌లో దుషారా విజయన్, అదితి బాలన్ వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి సమర్పణలో, సర్గుణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను వాల్‌వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. నటీనటుల పర్‌ఫార్మెన్స్, రియలిస్టిక్ టేకింగ్ ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్ (NEET) ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న తరుణంలో, సరిగ్గా అదే పాయింట్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్ రావడం దీనికి మరింత ప్లస్ అయింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ సిరీస్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో పాటు ప్రముఖ రేటింగ్ సంస్థ 'ఐఎమ్‌డీబీ' (IMDb)లో కూడా ఈ సిరీస్‌కు ఏకంగా 8.4/10 రేటింగ్ లభించడం విశేషం. ఈ మధ్య కాలంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఈ స్థాయి రేటింగ్ రావడం చాలా అరుదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంచి సస్పెన్స్, సమాజానికి అవసరమైన సందేశంతో కూడిన రియలిస్టిక్ డ్రామాను చూడాలనుకునే వారికి ఈ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు ఆడియెన్స్ కోసం తెలుగు ఆడియోలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ వాచ్ కోసం ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోండి!




