సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ రిలేషన్‌షిప్‌ను ఇన్నాళ్లు ఎందుకు ప్రైవేట్‌గా ఉంచారనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. ‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ జంట.. తమ ప్రేమకథకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ బంధాన్ని దాచిపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని, అయితే దాని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం మాత్రం తమకు అనిపించలేదని విజయ్ స్పష్టం చేశాడు.
విజయ్ మాట్లాడుతూ.. రష్మికతో తన పరిచయం తొలుత కోస్టార్స్‌గా మొదలైందని, ఆ తర్వాత స్నేహంగా మారిందని చెప్పాడు. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారిందని, చివరకు ఆమె తన జీవిత భాగస్వామిగా మారిందని వివరించాడు. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని అందరికీ చెప్పాల్సిన బాధ్యత తనకు లేదని విజయ్ పేర్కొన్నాడు. ‘ఇది నా జీవితం.. దీన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఏముంది?’ అనే భావనతోనే తమ బంధాన్ని ప్రైవేట్‌గా ఉంచినట్లు చెప్పుకొచ్చాడు.
రష్మిక కూడా ఇదే విషయాన్ని మరో విధంగా వివరించింది. తమ రిలేషన్‌షిప్ ఎవరి వినోదం కోసం, గాసిప్ కోసం కాదని ఆమె చెప్పింది. జీవితంలో కొన్ని విషయాలు తమకు ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటాయని, వాటిని తమ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలని అనుకున్నామని పేర్కొంది. అందుకే తమ బంధం గురించి బయట పెద్దగా మాట్లాడలేదని తెలిపింది. ఇక తమ ప్రేమకథలో ప్రత్యేకంగా ‘ఈ రోజే ప్రేమలో పడ్డాం’ అని చెప్పుకునే సందర్భం కూడా లేదట. ఒకరినొకరు మూడు, నాలుగేళ్లు తెలుసుకున్న తర్వాత తమ మధ్య ఉన్న అనుబంధం సాధారణ స్నేహం కంటే ప్రత్యేకమైనదని రష్మికకు అర్థమైందట.
ఇక పెళ్లికి ఏడాది ముందు రష్మిక తన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తిగా మారిందో తనకే స్పష్టంగా అర్థమైందని విజయ్ చెప్పాడు. ఆమెతో కలిసి పనిచేసినా, ట్రైనింగ్‌కు వెళ్లినా, భోజనం చేసినా ప్రతి పని మరింత ఆనందంగా అనిపించేదని వెల్లడించాడు. తాను ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు కూడా ‘రష్మిక ఇక్కడ ఉంటే బాగుండేది’ అనే ఆలోచన వచ్చేదని, తన జీవితంలోని చిన్న చిన్న సందర్భాల్లోనూ ఆమెను మిస్ అవుతున్నానని గుర్తించిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఆసక్తికరంగా తమ మధ్య ప్రత్యేకమైన ప్రపోజల్ కూడా జరగలేదని, ఎప్పుడు స్నేహం ప్రేమగా మారిందో ఇద్దరికీ కచ్చితంగా తెలియదని ఈ జంట వెల్లడించింది.
[Vijay Deverakonda, Rashmika Mandanna, Vijay Rashmika Relationship, Vijay Rashmika Love Story, Vijay Deverakonda Marriage, Rashmika Mandanna Marriage, Ranabaali, Telugu Cinema, Tollywood News, Vijay Rashmika Relationship Secret]




