
'హై జవానీ తో ఇష్క్ హోనా హై.. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే జంటగా అగ్ర దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించాడు. రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. జూన్ 5 న విడుదలకి సిద్దమవుతుంది.
ఈ చిత్రంలో 1999 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చి సంచలన విజయం సాధించిన 'బీవీ నెం. 1' మూవీలోని ఐకానిక్ సాంగ్స్ 'చున్నరి చున్నరి', 'ఇష్క్ సోనా హై' సాంగ్స్ ని యూజ్ చేశారు. దీంతో సరికొత్త కాపీరైట్ యుద్ధం మొదలైంది. 'ఈ రెండు సూపర్ హిట్ పాటలని తమ అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టిప్స్ ఇండస్ట్రీస్‌తో పాటు దర్శకుడు డేవిడ్ ధావన్‌పై బీవీ నెం. 1 నిర్మాత వాషూ భగ్నానీ ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారం కోరుతు బాంబే హైకోర్టులో దావా వేసాడు.
వాషూ భగ్నానీ లాయర్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో టిప్స్ కంపెనీకి కేవలం ఆడియో హక్కులు మాత్రమే ఇవ్వబడ్డాయి.కానీ విజువల్స్ లేదా రీమేక్ చేసే వీడియో హక్కులు ఇవ్వలేదు. 2018 లో టిప్స్ సంస్థ విజువల్ రైట్స్ కోసం ఈమెయిల్ ద్వారా అడిగినప్పటికీ, ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా తమ కష్టాన్ని, ఐపీని వాడుకోవడంపై వాషూ భగ్నానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ చిత్ర ప్రదర్శనని , ప్రమోషన్లని తక్షణమే నిలిపివేయాలని కోర్టులో దావా వేశారు. ఒకవేళ తమ డిమాండ్లను పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తే, మరో 100 కోట్ల రూపాయల అదనపు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also read: IMDb: ఐఏండిబీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ఈ ఛోటా హీరోదే..స్టార్స్ ని వెనక్కి నెట్టేసి మరి
మరోవైపు టిప్స్ ఇండస్ట్రీస్ అధినేత రమేష్ తౌరానీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదాన్ని ఒక వ్యక్తిగత కక్షతో చేస్తున్న దుష్ప్రచారంగా వారు అభివర్ణించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టబద్ధమైన ఒప్పందాల ప్రకారమే తాము ఆయా పాటల హక్కులను అనుభవిస్తున్నామని, జూన్ 5 న విడుదల కాబోతున్న తమ సినిమాను అడ్డుకోవడానికే వాషూ భగ్నానీ కావాలనే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని టిప్స్ బృందం స్పష్టం చేసింది. 1995 లో 'కూలీ నెం. 1' సినిమా సమయంలో వాషూ భగ్నానీకి తామే 50 శాతం భాగస్వామ్యం ఇచ్చి పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశామని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరు బాధాకరమని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం బాంబే హైకోర్టు పరిధిలో ఉండటంతో, బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం జూన్ 5న సినిమా విడుదలవుతుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.





