Home

»

Latest News

వారణాసి వాయిదా: అసలు నిజమేంటి?.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?

Nov 18, 2026 5:55PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం మొదలైంది. ఏప్రిల్ 7, 2027న విడుదల కావాల్సిన ఈ సినిమా జులై 30కి వెళ్లిపోవచ్చనే వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమా వాయిదా పడుతుందా లేదా అనేది షూటింగ్‌పై ఆధారపడి లేదు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిందట. ఎడిటింగ్ పనులు కూడా చాలావరకు ముగిశాయని తెలుస్తోంది. కీలక సన్నివేశాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ఎడిట్ చేశారట. అయితే ఫైనల్ ఎడిట్‌ను మాత్రం ఇంకా లాక్ చేయాల్సి ఉందని సమాచారం.

ఈ సినిమా కోసం ప్రపంచంలోని ప్రముఖ VFX సంస్థలు పనిచేస్తున్నాయి. రాజమౌళి ఈ సంస్థలకు డిసెంబర్ చివరి నాటికి విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేసి అందించాలని డెడ్‌లైన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే సినిమా విడుదల తేదీపై అసలు ఉత్కంఠ నెలకొంది.

VFX పనులు అనుకున్న సమయానికి పూర్తయితే.. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారట. రీ-రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ సహా తుది మెరుగులు దిద్దే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ‘వారణాసి’ విడుదల తేదీ విషయంలో కీలకమైన అంశం VFX పనులే అన్నమాట. అవి సమయానికి అందితే ఏప్రిల్ 7న సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

ఇది కూడా చదవండి: వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!

ఇక సినిమాలో కొన్ని ప్యాచ్‌వర్క్ సన్నివేశాల కోసం జనవరిలో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది చాలా తక్కువ రోజుల షూటింగ్ మాత్రమేనని తెలుస్తోంది. ఆ తర్వాత మార్చిలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, మార్చి నుంచి ఏప్రిల్ వరకు భారీ స్థాయిలో గ్లోబల్ ప్రమోషన్స్ నిర్వహించాలనేది మేకర్స్ ప్రణాళికగా ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కలన్నీ చూస్తుంటే ‘వారణాసి’ టీమ్ ఏప్రిల్ 7 విడుదల లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే డిసెంబర్ చివరి నాటికి VFX పనులు ఎంతవరకు పూర్తవుతాయన్నదే ఇప్పుడు కీలకం.

ఒకవేళ VFX సంస్థలు డెడ్‌లైన్‌లోగా పనులు పూర్తి చేయలేకపోతే మాత్రం సినిమా విడుదలను జులైకి వాయిదా వేసే అవకాశం ఉందని టాక్.

మీకు నచ్చవచ్చు:
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.?
హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.!

 

 

 

[Varanasi Release Date, Varanasi VFX, Mahesh Babu, SS Rajamouli]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com