Home

»

Latest News

‘వారణాసి’ స్టోరీ లీక్: రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!

Nov 9, 2026 2:51PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రెడ్డిట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ కథనం చూస్తుంటే.. రామాయణం, టైమ్ ట్రావెల్, ప్రపంచవ్యాప్త సాహసాల కలయికగా సినిమా ఉండబోతోందా? అనే ఆసక్తి కలుగుతోంది.

ఈ వైరల్ థియరీ ప్రకారం.. సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్ర కుంభకర్ణుడి పునర్జన్మగా ఉంటుందట. కుంభకర్ణుడు రావణుడికి సోదరుడు అనే విషయం తెలిసిందే. ఈ కథలో రావణుడికి సంబంధించిన నవరత్నాల హారాన్ని తిరిగి సంపాదించడమే కుంభ లక్ష్యమని ప్రచారం జరుగుతోంది. ఆ హారంలో తొమ్మిది శక్తిమంతమైన రత్నాలు ఉంటాయని, వాటిని సొంతం చేసుకుంటే అపారమైన శక్తి లభిస్తుందని ఈ కథనం చెబుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. జైన రామాయణ కథనం ప్రకారం.. రావణుడి ముఖ ప్రతిబింబం ఆ తొమ్మిది రత్నాల్లో కనిపించడం వల్ల ఆయనకు పది తలలు ఉన్నట్లుగా కనిపించేవారని, అందుకే దశాననుడు అనే పేరు వచ్చిందని ఈ థియరీలో పేర్కొంటున్నారు. రామ-రావణ యుద్ధం తర్వాత ఆ రత్నాలు ప్రపంచంలోని వివిధ ఖండాల్లో చెల్లాచెదురయ్యాయని ఊహిస్తున్నారు.

ఈ కథనం ప్రకారం.. కుంభ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రను ఉపయోగించుకుంటాడట. తొమ్మిది రత్నాలను సేకరించి తీసుకురావాలని అతడికి బాధ్యత అప్పగిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో మహేష్ పాత్ర ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆ రత్నాల కోసం అన్వేషణ సాగిస్తుందట.

ఇది కూడా చదవండి: సీతాదేవి పాత్ర.. సాయిపల్లవి అప్పటిలా లేదు.. ధనుష్ వైరల్ కామెంట్స్.!

ఈ ప్రయాణంలోనే అసలు సైన్స్ ఫిక్షన్ అంశం తెరపైకి వస్తుందని వైరల్ కథనం చెబుతోంది. వార్మ్‌హోల్ ద్వారా మహేష్ బాబు పాత్ర నేరుగా రామాయణ కాలంలోకి ప్రయాణిస్తుందట. అక్కడ జరిగే సంఘటనలు కథను మరో మలుపు తిప్పుతాయని ఊహిస్తున్నారు.

ఈ థియరీలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందట. తొమ్మిది రత్నాలన్నీ ఒకచోట చేరితే కుంభకు ఎదురులేని శక్తి లభిస్తుందని రుద్ర తెలుసుకుంటాడట. అలా జరిగితే ప్రపంచానికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించి.. కుంభ కుట్రను అడ్డుకోవాలని నిర్ణయించుకుంటాడట.

అందుకోసం మళ్లీ గతంలోకి వెళ్లి రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన ఓ కీలక సంఘటనలో జోక్యం చేసుకుంటాడని, తద్వారా ఆ తొమ్మిది రత్నాలు చెల్లాచెదురవకుండా వాటి భవిష్యత్తునే మార్చేస్తాడని ఈ కథనం చెబుతోంది. అంటే గతంలో జరిగిన ఓ సంఘటనను మార్చడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అడ్డుకునేలా కథ సాగుతుందన్నమాట.

ఇప్పటికే ‘వారణాసి’ టైమ్ ట్రావెల్, మైథాలజీ అంశాలతో కూడిన గ్లోబల్ అడ్వెంచర్‌గా ఉండబోతుందనే ప్రచారం ఉంది. మహేష్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు. అయితే రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న నవరత్నాల హారం, కుంభకర్ణుడి పునర్జన్మ, రామ-రావణ యుద్ధంలో మార్పులు వంటి వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.

రాజమౌళి తన సినిమాల్లో కథను ఊహించని మలుపులతో నడిపించడంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. అందుకే ఈ థియరీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి నిజంగానే రావణుడి నవరత్నాల చుట్టూ ‘వారణాసి’ కథ తిరుగుతుందా? లేక ఇది అభిమానుల ఊహల్లో పుట్టిన మరో ఆసక్తికరమైన కథనా? తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

మీకు నచ్చవచ్చు:
అప్పుడు ఫిట్‌గా ఉండాల్సింది.. తన ఓల్డ్ లుక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్స్.!
అసలైన సినిమా పండగ.. ఈ వారం థియేటర్లలో ఏకంగా 10 సినిమాలు.!

 

 

 

[Varanasi Movie Story, Ravana Navaratna Mala, Varanasi Story, Mahesh Babu, Rajamouli, Prithviraj Sukumaran, Ramayana, Ravanasura, Kumbha, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com