Home

»

Latest News

‘వారణాసి’కి హాలీవుడ్ దెబ్బ.. రాజ‌మౌళికి కొత్త త‌ల‌నొప్పి.!

Jul 16, 2026 5:53PM

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విజువల్‌ వండర్‌గా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లోబల్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ, హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రాజమౌళి ప్రతి విజువల్‌ను శిల్పంలా చెక్కుతున్నారు. అయితే, ఈ గ్లోబల్‌ ప్రాజెక్టుకు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక భారీ సవాల్‌ ఎదురుకాబోతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఐమాక్స్ (IMAX) స్క్రీన్ల పంపకాల విషయంలో 'వారణాసి' చిత్రానికి హాలీవుడ్‌ భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ థియేటర్ల రూపంలో ముంచుకొస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అద్భుతమైన స్క్రీన్ సైజ్, నెక్స్ట్ లెవెల్ సౌండ్ సిస్టమ్, విజువల్ క్వాలిటీతో లభించే ఆ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మనోళ్లు ఈ ఐమాక్స్ మజాను ఎంతో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ముంబై, బెంగళూరు, కొచ్చి వంటి మెట్రో నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. మన తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏంటంటే, వచ్చే ఏడాది కల్లా భాగ్యనగర వాసులకు మళ్లీ ఐమాక్స్ అదృష్టం దక్కబోతోంది, అలాగే మరో 2 అదనపు స్క్రీన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి క్రేజీ ఫార్మాట్ కోసం రాజమౌళి 'వారణాసి' చిత్రాన్ని ప్రత్యేకంగా అత్యంత ఖరీదైన ఐమాక్స్ టెక్నాలజీతో షూట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా అనుకుంటున్న రిలీజ్ విండోకు ముందే రెండు క్రేజీ హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్త ఐమాక్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయి. 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్ నోవా’, అలాగే ఏప్రిల్ 9న విడుదల కానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘పానిక్ కేర్ ఫుల్లీ’ ఐమాక్స్ స్క్రీన్లపై కన్నేశాయి. ఈ రెండు భారీ హాలీవుడ్ చిత్రాల మధ్యలోనే రాజమౌళి 'వారణాసి' సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సి ఉంది.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ చైన్ల మద్దతు చాలా బలంగా ఉంటుంది. వాళ్లు సినిమా రిలీజ్‌కు కనీసం 6 నెలల ముందే అగ్రిమెంట్లు, థియేటర్ల ఒప్పందాలు క్లోజ్ చేసుకుంటారు. మన టాలీవుడ్‌లాగా చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ సాగదీసి, తాపీగా రిలీజ్ డేట్లను పోస్ట్‌పోన్ చేసే అలవాటు హాలీవుడ్ మేకర్స్‌కు ఉండదు. అందుకే హరిహరాదులు దిగి వచ్చినా వాళ్ల అగ్రిమెంట్లలో మార్పులు చేయడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుంచే అలర్ట్ అవ్వాలని, థియేటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని జక్కన్నతో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్న ఎస్.ఎస్. కార్తికేయకు గట్టిగా సూచిస్తున్నారట.

ప్లాన్ ప్రకారం 'వారణాసి' చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఒకవేళ అదే తేదీకి పక్కాగా రావాలనుకుంటే ఐమాక్స్ స్క్రీన్ల కోసం ఇప్పటి నుంచే లాబీయింగ్, గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టడం చాలా అవసరం. గతంలో సంచలనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) రికార్డులను మించిపోయేలా అన్ని దేశాల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని రీచ్ చేయాలనే దృఢ సంకల్పంతో జక్కన్న పగలు రేత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో హాలీవుడ్ కాంపిటీషన్ వల్ల ఓవర్సీస్‌లో స్క్రీన్ కౌంట్ తగ్గితే కలెక్షన్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, రాజమౌళి టీమ్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఆరు నూరైనా సరే అనుకున్న ఏప్రిల్ 7వ తేదీకే వారణాసి థియేటర్లలోకి రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. 

 

 

Varanasi movie, IMAX, Rajamouli maheshbabu

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com