
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన 'తబాహి' వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా హీరో యష్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ రొమాంటిక్ నంబర్‌లో పీక్స్‌కు చేరింది.
అయితే, ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే ఒక వర్గం నెటిజన్లు కియారా అద్వానీని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కియారా ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ సీన్స్‌లో నటించడం ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ హద్దులు దాటి ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ వివక్షతతో కూడిన ట్రోలింగ్‌పై 'టాక్సిక్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ.. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన డబుల్ స్టాండర్డ్స్ ను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. "సోషల్ మీడియాలో ఒకే పాటకు రెండు రకాల స్పందనలు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. సాంగ్ చూసిన వారంతా యష్ బాడీ లాంగ్వేజ్‌ను, ఆయన లుక్స్‌ను పొగుడుతూ ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అదే సమయంలో కియారా విషయానికి వస్తే మాత్రం ఆమెను ఒక జోక్‌లా మార్చేశారు. ఆమెకు పెళ్లయింది కదా, ఆమె ఒక తల్లి కదా, ఇలాంటి సీన్లు చేయడమేంటి? అంటూ విమర్శిస్తున్నారు. సీరియస్లీ.. నాకు ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తోంది" అంటూ బెనెడిక్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, హీరో యష్ కూడా వివాహితుడేనని, ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని బెనెడిక్ట్ గుర్తు చేశారు. "మరి యష్ కూడా వివాహితుడే కదా, ఆయనకు పిల్లలు ఉన్నారు కదా.. మరి కేవలం స్త్రీ అయినందుకే కియారాపై ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తున్నారు? అదే పురుషుడైతే చప్పట్లు కొడుతూ ప్రశంసిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం?" అని ప్రశ్నించారు.
నటీనటులు కేవలం తమకు ఇచ్చిన పాత్రల పరిధి మేరకు మాత్రమే నటిస్తారని, తెరపై వారు నిజంగా ప్రేమించుకుంటున్నట్లు భ్రమ కల్పించడమే వారి వృత్తి అని ఆయన స్పష్టం చేశారు. కియారా ప్రొఫెషనలిజంలో ఎలాంటి తప్పు లేదని, కేవలం ఆమె ఒకరి భార్య, తల్లి అయినంత మాత్రాన నటనను ఆపేయాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని బెనెడిక్ట్ తేల్చి చెప్పారు. ఈ వివాదం నటీనటుల కంటే సమాజంలో ఉన్న కుంచిత మనస్తత్వాన్ని ఎత్తిచూపుతోందని ఆయన రాసుకొచ్చారు. ఈ బ్రిటిష్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Toxic Movie, Tabaahi song controversy, Yash, Kiara Advani, Benedict Garrett





