ఆస్కార్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్‌కు కరోనా పాజిటివ్!
on Mar 12, 2020
హాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకరు, ఆస్కార్ ఉత్తమ నటుడు టామ్ హాంక్స్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన హాంక్స్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడం సంచలనం సృష్టించింది. 'ఫారెస్ట్ గంప్' (ఈ సినిమానే ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' పేరుతో రీమేక్ చేస్తున్నాడు) హీరోగా ఫేమస్ అయిన 63 ఏళ్ల హాంక్స్, భార్య రీటా విల్సన్ ఇద్దరికీ ఒంటినొప్పలు, అలసట, కొంచెం జ్వరం రావడంతో వైద్య సహాయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హాంక్స్ స్వయంగా తన ట్విట్టర్ పోస్ట్‌లో వెల్లడించాడు.
"ప్రజారోగ్యం అవసరమైనంత కాలం మాకు టెస్టులు నిర్వహిస్తారు, అబ్జర్వేషన్లో, ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఎప్పటికప్పడు ప్రపంచానికి మా ఆరోగ్యం గురించి తెలియజేస్తుంటాం" అని ఆయన పోస్ట్ చేశాడు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్, యాక్టర్ ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ షూటింగ్ నిమిత్తం హాంక్స్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆ మూవీలో ఆయన ప్రెస్లీ స్టార్డమ్ అందుకోవడానికి తోడ్పడిన ఆయన మేనేజర్ కల్నల్ టామ్ పార్కర్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడు. ప్రెస్లీ రోల్‌ను ఆస్టిన్ బట్లర్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియన్ డైరెక్టర్ బజ్ లుర్మన్ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలైంది. టామ్ హాంక్స్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో గురువారం షూటింగ్ ఆపేశారు. యూనిట్లో ఉన్న మిగతా మెంబర్స్‌కు కూడా టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.