
ఒక ఫేమస్ రైటర్ ఎప్పుడో చెప్పాడు.. ప్రేయసి తన ప్రియుడితో దూరముంటానులే దగ్గరయ్యేందుకు అంటుంది అని. తన ప్రేమని దక్కించుకోవడం కోసం సాక్షాత్తు ప్రేయసినే ఆ విధంగా ఫిక్స్ అయితే మరి సెల్యులాయిడ్ పై లక్షలాది మంది అభిమానులని, ప్రేక్షకులని అలరించడానికి హీరో ఏం చేయాలి. ఇదేంటి ఆ రెండు మ్యాటర్స్ కి మధ్య సంబంధం ఏంటంటారా? అయితే మీరే చూడండి.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులతో, ప్రేక్షకులతో నేరుగా టచ్‌లో ఉండటం మంచిదా లేక ప్రమాదకరమా అనే విషయంపై సినీ విశ్లేషకులు కీలక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలను చూడాలంటే కేవలం వెండితెర మీద మాత్రమే సాధ్యమయ్యేది. నెలల తరబడి ఎదురుచూసి, మొదటి రోజు థియేటర్‌కు వెళ్లి తమ అభిమాన హీరోను బిగ్ స్క్రీన్‌పై చూడగానే ప్రేక్షకులకు ఒక రకమైన పూనకం వచ్చేది.
ఆ నిరీక్షణే హీరో ఇమేజ్ ఆకాశానికి ఎత్తేది. కానీ నేటి డిజిటల్, జెన్ జీ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరోలు ప్రతి చిన్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరీ అందుబాటులోకి వచ్చేస్తున్నారు.

నిత్యం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుండటం వల్ల హీరోల చుట్టూ ఉండే ఆ ప్రత్యేకమైన ఆరా, మిస్టరీ క్రమంగా తగ్గిపోతోంది. ఉదయం లేచినప్పటి నుండి జిమ్ వర్కౌట్లు, విదేశీ విహారయాత్రలు, వ్యక్తిగత ఫోటోలు ఇలా అన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండటంతో ప్రేక్షకుడికి హీరో మరీ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. దీనివల్ల మూవీ రిలీజ్ రోజు థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుడు తెరపై హీరోను చూసి ఆ ఆశ్చర్యాన్ని, అసలైన హీరో మజాను పొందలేకపోతున్నాడు. కొత్తదనం లోపించడంతో థియేటర్లలో విజిల్స్, చప్పట్ల జోరు కూడా తగ్గుతోంది.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబంపై పూజిత పొన్నాడ షాకింగ్ మాటలు: నిజగానే అన్యాయం జరిగిందా!
ఈ అతి సాన్నిహిత్యం బాక్సాఫీస్ ఫలితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కథలో బలం ఉండి, ఒక మాదిరిగా ఆడాల్సిన సినిమాలు కూడా కేవలం హీరోపై ఉన్న ఆసక్తి తగ్గిపోవడం వల్ల ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయి. అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. హీరోను చూడటం కోసమే థియేటర్‌కు వెళ్లే రోజులు కనుమరుగవుతున్నాయి. ఓవర్ ఎక్స్పోజర్ కారణంగా యావరేజ్ సినిమాలను నిలబెట్టే స్టార్ పవర్ బలహీనపడుతోందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.
అయితే ఈ విషయంలో సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ పాత పంథానే కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగానే ఉంటున్నారు. కేవలం సినిమా అప్డేట్లు, పండుగ శుభాకాంక్షలు లేదా ఏదైనా ముఖ్యమైన సామాజిక అంశాలపై స్పందించడానికి మాత్రమే వారు సోషల్ మీడియాను వాడుతున్నారు. అనవసరమైన వ్యక్తిగత పోస్టులు పెట్టకుండా తమ స్టార్డమ్కు ఒక హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు. అందుకే వారి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లలో ఆ క్రేజ్, ఆ సంబరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తోంది. నేటి యువ హీరోలు కూడా ఈ విషయాన్ని గ్రహించి, సోషల్ మీడియా వినియోగానికి ఒక పరిమితి పెట్టుకుంటేనే థియేటర్లలో మళ్లీ అసలైన హీరోయిజం పండుతుందని సినీ అభిమానులు సూచిస్తున్నారు.

సో... జెన్ జీ బ్యాచ్ కోసం సోషల్ మీడియాలో పనిగట్టు కొని కావాలని టచ్ లో ఉండి, మీ గొయ్యి మీరే తీసుకోకండి. ఎందుకంటే మీరు హీరో.. సినిమా హీరో బాబు.....మరువకు సుమీ...
మీకు నచ్చవచ్చు :ఈ నగరానికి ఏమైంది రిపీట్ హిట్టా, ఫట్టా!
మీకు నచ్చవచ్చు :సంజయ్ దత్ గత జన్మలో: మంత్రిని, తన భార్యని.. ఏం చేసాడంటే!
[Tollywood Heroes, Social Media, Senior heroes, young Heros]





