బాక్సాఫీస్‌ని ఆడేసుకుంటున్న సీనియర్లు!
on Feb 7, 2023
కరోనా తరువాత కొంతమంది హీరోలా భవితవ్యం డోలాయమానంలో పడింది. అగమ్య గోచరంగా తయారయింది. ఓటీటీల యుగంలో వయసు మళ్ళిన సీనియర్ స్టార్లు నటించిన చిత్రాల కోసం ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారా? వచ్చి చూస్తారా? అనే కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్ లో కొన్ని నిజం అని కూడా నిరూపించాయి. ఆయా సీనియర్ స్టార్స్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ఇక ఈ సీనియర్ల పరిస్థితి అయిపోయిందని అందరూ భావించారు. కానీ తాజాగా ఈ విషయం తప్పని మన సీనియర్ స్టార్స్ నిరూపిస్తున్నారు.
వారు తమకు తగ్గ చిత్రాన్ని ఎంచుకొని నటిస్తే యంగ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోరని వారిని మించిన క్రేజ్ సీనియర్ స్టార్లకు ఉందని చేతల్లో చూపిస్తున్నారు. వారికంటూ స్పెషల్ క్రేజ్ ఇప్పటికీ ఉందని దీని ద్వారా అర్థమవుతుంది. ఆరు పదులు దాటిన వయసులో కూడా ఈ సీనియర్ స్టార్స్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లతో షేక్ చేస్తున్నారు. దాదాపు నాలుగు ఐదేళ్ల విరామం తరువాత కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇండస్ట్రీ హిట్టుగా విక్రమ్ నిలిచింది. దాంతో మరల అందరూ లోక నాయకుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన నటిస్తున్న ఇండియన్ 2 పై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చారు.
ఆ చిత్రం బాగానే ఆడింది. కానీ ఆ తరువాత కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఇలాంటి సమయంలో చిరు నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో ఆ అంశాలను పొందుపరుస్తూ తీసిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీసును గడగడలాడించింది. ఏకంగా 200 కోట్లు వసూలు చేసి 200 కోట్ల క్లబ్బులో రెండోసారి పాగా వేసింది. సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి తన మార్క్ ఫ్యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఇప్పటికే 130 కోట్ల గ్రాసును వసూలు చేసినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో 150 కోట్ల మార్పును చేరుకొంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక 57 ఏళ్ల షారుక్ ఖాన్ కూడా తనదైన పంథాలో పఠాన్ తో చెలరేగిపోయారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన చిత్రం ఏకంగా వారం తిరగకుండానే 700 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ జోష్ సాగుతూనే ఉంది. లాంగ్ రన్లో ఈ చిత్రం ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో ట్రేడ్ వర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి. ఇలా ఐదు పదులు దాటి ఆరు పదులు దాటిన వయసులో కూడా సీనియర్లు బాక్సాఫీస్ ని తమ చిత్రాలతో ఓ ఆట ఆడేస్తుండడం యంగ్ హీరోలకు హెచ్చరిక వంటిదే అని చెప్పాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
