
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కు ముందు ఎంత హైప్ తెచ్చుకుందో.. విడుదల తర్వాత అంతే స్థాయిలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సీన్లు, సవారీ కమ్యూనిటీ బ్యాక్‌స్టోరీ, సుబ్బు పాత్ర, కథనం వంటి అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది.
విడుదలైన తర్వాత సినిమాపై వచ్చిన విమర్శలపై నాని, శ్రీకాంత్ ఓదెల తాజాగా ఓ చిట్‌చాట్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో వచ్చిన చాలా సందేహాలకు దర్శకుడు వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణలతో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకొచ్చింది.
సవారీలు ఎవరు?
‘ది ప్యారడైజ్’లో సవారీ కమ్యూనిటీ కథ చాలా కీలకం. అయితే అసలు సవారీలు ఎవరు? వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్‌లో ఎందుకు స్థిరపడ్డారు? ధూమావతి మాతను ఎందుకు ఆరాధిస్తారు? అనే విషయాలు సినిమాలో పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదనే విమర్శలు వచ్చాయి.
అయితే శ్రీకాంత్ ఓదెల చెప్పిన బ్యాక్‌స్టోరీ మాత్రం చాలా పెద్దదే. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న జాతిగా సవారీలను దర్శకుడు డిజైన్ చేశాడట. ధూమావతి మాతను వాళ్లు ఆరాధ్య దైవంగా భావిస్తారు. కాకిని కూడా పూజిస్తారు. ఆ కాకిని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చిన సవారీలు.. అక్కడే స్థిరపడి నివసించిన ప్రాంతమే ‘ప్యారడైజ్’గా మారిందని శ్రీకాంత్ వివరించాడు.
రజాకార్ల ఉద్యమం సమయంలో కూడా సవారీలకు ప్రత్యేకమైన పాత్ర ఉందని.. వాళ్లను అడ్డుపెట్టుకుని షికంజీ మాలిక్ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని దర్శకుడు చెప్పాడు. ఆ తర్వాత తమ ఉనికి, గుర్తింపు కోసం సవారీలు తిరుగుబాటు చేయడం కథలో ప్రధాన అంశంగా మారుతుందని వివరించాడు.
ఇంత పెద్ద బ్యాక్‌స్టోరీ ఉన్నప్పటికీ.. సినిమాలో అది పూర్తిగా కనిపించకపోవడం వల్లే ప్రేక్షకులకు సవారీలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందనే చర్చ మొదలైంది.
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్’ డైలాగ్ ఎందుకంటే?
సుబ్బు పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్ కూడా విడుదల తర్వాత బాగా వైరల్ అయింది. బి గ్రేడ్ సినిమాలు చేస్తున్న తన కూతురితో తల్లి “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా” అని చెప్పే సీన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
అయితే ఈ డైలాగ్ వెనుక కూడా ఓ బ్యాక్‌స్టోరీ ఉందని శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు. సుబ్బు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ టాలెంట్ ఉన్న అమ్మాయి. కానీ ఆమె తల్లి మాత్రం ఆ టాలెంట్‌ను గుర్తించకుండా పెంచుతుంది. తర్వాత సుబ్బు పెద్దయ్యాక అదే టాలెంట్‌ను చూసి తల్లి అలా చెప్పే సందర్భాన్ని దర్శకుడు రాసుకున్నాడట.
అయితే ఆ బ్యాక్‌స్టోరీకి సంబంధించిన సన్నివేశాలను సినిమా రన్‌టైమ్ కారణంగా తొలగించాల్సి వచ్చిందని శ్రీకాంత్ తెలిపాడు. దీంతో కీలకమైన సెటప్ లేకుండా ‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్’ డైలాగ్ మాత్రమే తెరపై కనిపించడంతో.. ఆ సీన్ ఉద్దేశం పూర్తిగా మరోలా అర్థమైందని నాని కూడా అంగీకరించాడు.
అసలు సమస్య ఎక్కడ వచ్చింది?
ఇక్కడే ‘ది ప్యారడైజ్’పై జరుగుతున్న చర్చలో అసలు పాయింట్ బయటకొస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలోని చాలా అంశాలకు బ్యాక్‌స్టోరీ రాసుకున్నాడు. సవారీ కమ్యూనిటీ నుంచి సుబ్బు పాత్ర వరకు.. ప్రతి అంశం వెనుక ఓ కారణాన్ని ఆలోచించాడు. కానీ ఆ వివరాల్లో కొన్ని తెరపై పూర్తిగా కనిపించలేదు.
సినిమా అనేది విజువల్ మీడియా కాబట్టి.. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నా అది తెరపైనే అర్థమయ్యేలా ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూల్లో “ఆ సీన్ వెనుక ఇంత కథ ఉంది”, “ఆ డైలాగ్‌కు ఇలాంటి అర్థం ఉంది” అని చెప్పాల్సిన పరిస్థితి వస్తే.. ప్రేక్షకుడికి థియేటర్‌లో కలగాల్సిన ఎమోషన్ అప్పటికే మిస్ అయిపోయినట్టే. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో కూడా కొన్ని బ్యాక్‌స్టోరీలు పూర్తిగా చెప్పలేకపోవడం ఆసక్తికరంగా మారింది. అవసరం లేని సీన్లను మరింత ట్రిమ్ చేసి, కీలకమైన ఎమోషన్స్‌కు ఎక్కువ స్పేస్ ఇచ్చి ఉంటే తాను అనుకున్న ఫీల్ ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి.. ‘ది ప్యారడైజ్’ విషయంలో ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరణలు చూస్తే.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆలోచనలో చాలా అంశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే వాటిలో కొన్ని తెరపై ప్రేక్షకులకు అదే స్థాయిలో అర్థం కాకపోవడమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ఇది కూడా చదవండి: మెగా న్యూస్.. గ్లోబల్ టాక్ షోతో చిరంజీవి సంచలనం.!
[The Paradise Controversies, The Paradise Clarifications, Nani Srikanth Odela Interview, Srikanth Odela Chit Chat, The Paradise Movie, Savari Community, Dhumavati Mata, Nani Paradise Movie, Kayadu Lohar, Telugu Film News]





