Home

»

Latest News

'ది ఒడిస్సీ' ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎంత రాబట్టిందంటే.?

Jul 18, 2026 9:57AM

హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజే ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూలై 17న విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్, భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించి, ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్స్ జాబితాలో చేరిపోయింది.

'ది ఒడిస్సీ' చిత్రం ఇండియాలో మొదటి రోజు ఏకంగా రూ. 20.76 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల పరంగా చూస్తే రూ. 17.40 కోట్లు రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 8,413 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా, తొలిరోజు 48.7 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ముఖ్యంగా IMAX, 4DX వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నోలన్ గత చిత్రం 'ఓపెన్‌హైమర్' సాధించిన క్రేజ్‌ను ఈ సినిమా కంటిన్యూ చేస్తోందని స్పష్టమవుతోంది.

భాషల వారీగా చూసుకుంటే, ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ సింహభాగం వసూళ్లను సాధించింది. ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే దాదాపు రూ. 13.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టగా, 4,401 షోలలో ఏకంగా 77 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. హిందీ డబ్బింగ్ వెర్షన్ 2,851 షోల నుండి రూ. 1.90 కోట్ల నెట్ వసూలు చేయగా, సౌత్ మార్కెట్లలో కూడా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. తెలుగు వెర్షన్ 675 షోల ద్వారా దాదాపు రూ. 1.10 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో తెలుగు ఆక్యుపెన్సీ 30 శాతంగా నమోదైంది. మరోవైపు తమిళ వెర్షన్ 486 షోలతో రూ. 65 లక్షల నెట్ వసూలు చేస్తూ 28 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. 

అన్ని వెర్షన్ లు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 'ది ఒడిస్సీ'కి రూ. 3.40 కోట్లు వచ్చాయి. ఏపీలో రూ. 1.09 కోట్లు రాగా, తెలంగాణలో రూ. 2.31 కోట్లు వచ్చాయి. ఒక్క  హైదరాబాద్ లోనే 2 కోట్లకు పైగా వసూళ్ళు రావడం విశేషం.

హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు పురాణగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సియస్ తన భార్య పెనెలోప్‌ను చేరుకోవడానికి చేసిన సాహసోపేతమైన ప్రయాణం, వింత జీవులతో పోరాటాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

 

 

Christopher Nolan, The Odyssey, Box Office, India

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com