Home

»

Latest News

ఆహార‌మే విషంగా మారితే.. కొత్త పాయింట్‌తో ఓటీటీలోకి వ‌చ్చిన సినిమా.!

Oct 6, 2026 7:03PM

ప్రస్తుతం మనం తినే ఆహారం నిజంగా ఎంతవరకు సురక్షితం? పంటలకు ఉపయోగించే క్రిమిసంహారక మందులు, ఆహార పదార్థాల్లోని రసాయనాల ప్రభావం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇలాంటి కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చిన చిత్రమే ‘ది ఇండియా స్టోరీ’. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహించారు. జూలై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ విషయానికి వస్తే.. యోగేశ్ పాటిల్ (శ్రేయస్ తల్పాడే) ఆర్మీ అధికారి. అతడి ఏడేళ్ల కుమార్తె పరి (త్రిష శ్రద్ధా) క్యాన్సర్ బారిన పడుతుంది. తమ కుటుంబంలో ఇలాంటి వ్యాధి చరిత్ర లేదని తెలుసుకున్న యోగేశ్.. తన కుమార్తెకు వచ్చిన క్యాన్సర్‌కు పంటల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలే కారణమని భావిస్తాడు. ఎంత ప్రయత్నించినా కుమార్తెను కాపాడుకోలేకపోయిన అతడు.. తనలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదనే ఉద్దేశంతో పోరాటం మొదలుపెడతాడు. క్రిమిసంహారక మందుల తయారీ సంస్థలు, ప్రభుత్వం, రైతులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే అక్కడా, కోర్టులోనూ అతడి వాదనకు పెద్దగా స్పందన రాదు. ఈ సమయంలో కొత్తగా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన అర్చన (కాజల్ అగర్వాల్) అతడి కేసును స్వీకరిస్తుంది. ఆ తర్వాత బయటపడే విషయాలు, ఆమె ఎదుర్కొనే సవాళ్లే మిగతా కథ.

పంటలకు అధికంగా రసాయనాలు ఉపయోగించడం, పండ్లు, కూరగాయలను ఎక్కువకాలం తాజాగా ఉంచేందుకు వివిధ రకాల రసాయనాలను వినియోగించడం, ఆహారం ద్వారా వాటి ప్రభావం మనిషి శరీరంలోకి చేరడం వంటి అంశాలను దర్శకుడు కథలో ప్రస్తావించారు. ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ పద్ధతులు, క్రిమిసంహారక మందుల వినియోగం వంటి ప్రస్తుతం చర్చలో ఉన్న అంశాలను కోర్ట్‌రూమ్ డ్రామాతో ముడిపెట్టడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా తండ్రి–కూతురు ఎమోషన్ ప్రేక్షకులను కదిలించేలా ఉంది. శ్రేయస్ తల్పాడే తన పాత్రకు న్యాయం చేయగా.. కాజల్ అగర్వాల్ న్యాయవాది పాత్రలో ఆకట్టుకున్నారు. చిన్నారి త్రిష కూడా తన నటనతో మెప్పించింది. మురళీ శర్మ, మనీష్ వాధ్వా తదితరులు తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

అయితే ఇంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ దాన్ని తెరపై మరింత ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. ముఖ్యంగా రెండో భాగంలో కథనం నెమ్మదించడం, కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీ తరహాలో అనిపించడం, కోర్ట్‌రూమ్ సన్నివేశాల్లో ఆశించిన స్థాయిలో ఉత్కంఠ లేకపోవడం మైనస్‌లుగా మారాయి. కొన్ని లాజిక్కులు కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తాయి. మొత్తంగా మంచి, ఆలోచింపజేసే పాయింట్‌తో వచ్చిన సినిమా అయినప్పటికీ.. దానికి తగ్గ స్థాయిలో ఎమోషన్, డ్రామాను పండించలేకపోయింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com