
తెలంగాణ... కోటి రతనాల వీణ.. బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి అంటూ నాలుగున్నర దశాబ్దాల క్రితమే తెలుగు సెల్యులాయిడ్ పై చిందేసి తెలంగాణ మట్టి వాసనని, కుసుమాన్ని ప్రేక్షకులందరికి పంచింది. కానీ ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి.. భాషకి సంబంధించి పూర్తి తెలంగాణ చిత్రాలు పెద్దగా రాలేదు.
నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాలో ప్రాంతీయ యాసలంటే కేవలం హాస్యానికో, లేదా విలనిజానికో మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, కాలం మారింది. కథా బలమున్న మట్టి కథలు తెెరపైకి రావడం మొదలైనప్పటి నుంచి తెలంగాణ నేపథ్యం తెలుగు చిత్రసీమలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఈ రోజు తెలంగాణ సంస్కృతి, జీవన విధానం, ఇక్కడి ప్రజల భావోద్వేగాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాయి. స్థానిక కథలకే అంతర్జాతీయ స్థాయి ఆదరణ లభిస్తుందని మన సినిమాలు నిరూపిస్తున్నాయి.
ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒకప్పుడు హైదరాబాద్ లేదా రూరల్ ఆంధ్ర నేపథ్యంతో మాత్రమే సినిమాలు వస్తుండేవి. కానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకులు, రచయితలు తమ సొంత ఊరి కథలను, తాము చూసిన జీవితాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించడం ప్రారంభించారు. తెలంగాణ భాషలోని తీయదనం, యాసలో ఉన్న సహజత్వం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలు, పండుగలు, ఆచారాలు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడం మొదలైంది. అందుకు ప్రధాన బలం ఇచ్చిన మూవీ 'ఫిదా' అని చెప్పవచ్చు. ఆ తర్వాత 'పెళ్లి చూపులు', 'బలగం', 'దసరా' తో పాటు చాలా యూత్ ఫుల్ చిత్రాలు కూడా ఇప్పుడు తెలంగాణ నేపధ్యంతోనే వస్తున్నాయి. ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తున్న ప్యారడైజ్ కూడా తెలంగాణ నేపధ్యమే. బాక్సాఫీస్ వద్ద తెలంగాణ నేపధ్యానికి మున్ముందు మంచి రోజులు రాబోతున్నాయనే మార్పుకి ఇవే బలమైన సాక్ష్యాలు.
ఇది కూడా చదవండి: 'ది ప్యారడైజ్' పై కవిత సంచలన కామెంట్స్!

కేవలం కమర్షియల్ విజయాలు మాత్రమే కాకుండా, ఈ సినిమాలు తెలంగాణ భాష మరియు సంస్కృతిపై ఉన్న అపోహలను పూర్తిగా పటాపంచలు చేశాయి. తెలంగాణ యాసలో పలికే సంభాషణలు ఇప్పుడు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలలో సాధారణ విదేశీ ప్రేక్షకులు కూడా ఈ మట్టి కథలకు బ్రహ్మరథం పడుతున్నారు. యూట్యూబ్ మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తెలంగాణ నేపథ్య సినిమాలకు 70% కంటే ఎక్కువ డిజిటల్ వ్యూయర్ షిప్ నమోదవుతుండటం విశేషం. ఏది ఏమైనా తెలంగాణ నేపథ్యం ఇప్పుడు కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, తెలుగు సినిమాకు ఒక కొత్త గుర్తింపు మరియు ఆత్మగా మారింది. ముందు ముందు మరిన్ని వైవిధ్యమైన తెలంగాణ కథలు ప్రపంచ వేదికలపై మెరిసి, తెలుగు సినిమా రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా కళామ తల్లి కూడా అంటుంది నా 'తెలంగాణ కోటి రతనాల వీణ' అని.
[Telangana Movies Global Success, Telangana movies, telugu cinema success, The Paradise movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






