
- తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
- సినిమా థియేటర్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు
- పాత ఉత్తర్వులపై హైకోర్టు స్టే
- ఏషియన్ కోనార్క్ మినహా అన్ని థియేటర్లలో పార్కింగ్ ఫీజు
తెలంగాణలోని సినీ ప్రియులకు హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదంటూ ఉన్న నిబంధనపై తాజాగా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఈ కేసులో థియేటర్ యజమానుల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలను వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని, థియేటర్ యజమానుల వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు. దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని వారు పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు, ఈ వివాదంలో ఒక కీలకమైన సాంకేతిక అంశాన్ని లేవనెత్తింది. అసలు పిటిషనర్ ఒక నిర్దిష్ట థియేటర్ (ఏషియన్ కోనార్క్) లో వసూలు చేస్తున్న ఫీజుపై మాత్రమే కేసు వేశారని, కానీ ఆ ఉత్తర్వును రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్‌కే పరిమితం కావాలని పేర్కొంది.

ప్రస్తుత తీర్పు ప్రకారం, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది థియేటర్ యజమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, సామాన్య ప్రేక్షకులకు మాత్రం అదనపు భారంగా మారనుంది.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు, క్యాంటీన్ రేట్లు పెరిగిపోయాయని, ఇప్పుడు మళ్లీ పార్కింగ్ ఫీజు కూడా తోడైతే సామాన్యుడు థియేటర్‌కు రావడం కష్టమని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు థియేటర్ యజమానులు మాత్రం నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇది తప్పనిసరి అని వాదిస్తున్నారు.





