జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ‘సత్య’ అనే పాత్రలో నటించిన రాజీవ్ కనకాల.. పాతికేళ్ల తర్వాత ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సినీ కెరీర్‌లో ‘స్టూడెంట్ నంబర్ 1’కు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘స్టూడెంట్ నంబర్ 1’ తన జీవితంలో, సినీ ప్రయాణంలో మరచిపోలేని అధ్యాయమని రాజీవ్ కనకాల తెలిపారు. ఈ సినిమాలో పోషించిన ‘సత్య’ పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిందని.. ఇప్పటికీ ప్రేక్షకులు తనను ఆ పాత్ర పేరుతో గుర్తుపట్టడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా విజయవంతమైన తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని సినిమాల్లో కొనసాగానని ఆయన గుర్తుచేసుకున్నారు. తొలినాళ్లలో సినిమాపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు 42 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై విజయాన్ని అందుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రబృందానికి రాజీవ్ కనకాల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా తనకు అందించిన విలువైన బహుమతి స్నేహమని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగిందని, జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం తనకు లభించిందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
ఇక ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనూ, రాజమౌళి దర్శకుడిగా ప్రయాణంలోనూ కీలకమైన ప్రారంభ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ను గుర్తుచేసుకుంటూ రాజీవ్ కనకాల చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
[Student No 1 25 Years, Rajeev Kanakala, Jr NTR Student No 1, SS Rajamouli Student No 1, Rajeev Kanakala Emotional Post, Student No 1 Anniversary, Rajeev Kanakala NTR Friendship]






