దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన క్రేజ్ నెలకొంది. 'బాహుబలి'తో భారతీయ సినిమా సత్తాను చాటిన ఆయన, 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు జెండాను ఎగరేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన చేస్తున్న భారీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' . ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తాజాగా ఈ మూవీ టీమ్ అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు వేసింది.
మెక్సికోలో ఘనంగా నిర్వహించిన ప్రఖ్యాత 'కామిక్ కాన్' (Comic Con) వేదికపై 'వారణాసి' చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గ్లోబల్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ వీడియోను ప్రదర్శించి అక్కడి ఆడియన్స్‌ను థ్రిల్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా వేదికపైకి వచ్చి, సినిమా కాన్సెప్ట్ మరియు విజువల్ గ్రాండియర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో జోష్ నింపాయి.
ముఖ్యంగా ఈ వేడుకలో రాజమౌళి పంపిన వీడియో సందేశం హైలైట్‌గా నిలిచింది. 'వారణాసి' అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి కనిపించిన జక్కన్న, తనకి మెక్సికో సంస్కృతితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ 'బాహుబలి' సెట్స్ రూపకల్పనలో మెక్సికోలోని చారిత్రాత్మక కట్టడాల స్పూర్తి ఉందని ఆయన వెల్లడించడం విశేషం. ప్రపంచ నాగరికతలపై తనకున్న ఆసక్తిని వివరిస్తూ, ఈ కొత్త చిత్రం ఆ స్థాయిలోనే ఉండబోతోందని హింట్ ఇచ్చారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రానికి లభించిన గ్లోబల్ రీచ్ గురించి ప్రస్తావిస్తూ.. 'నాటు నాటు' పాటకు ప్రపంచ దేశాల వారు డాన్సులు చేయడం చూసిన తర్వాత, తను ఎందుకు సినిమాలు తీస్తున్నానో తనకు క్లారిటీ వచ్చిందని రాజమౌళి భావోద్వేగంగా చెప్పారు. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ప్రేక్షకులిచ్చిన ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా, ప్రపంచ సినీ ప్రేమికులను అలరించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారణాసి' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు, భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. మెక్సికో కామిక్ కాన్‌లో వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, రాజమౌళి మరోసారి ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.






