
1. 'వారణాసి' ఒక గొప్ప అడ్వెంచర్
మెక్సికోలో జరుగుతున్న 'CCXP 2026' వేదికగా రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' మూవీ గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో సందేశంలో.. ఈ సినిమా ఇండియన్ మైథాలజీ, గ్లోబల్ యాక్షన్ కలయికతో కూడిన ఒక గొప్ప అడ్వెంచర్ అని పేర్కొన్నారు. బలమైన ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. ఇక గ్లింప్స్‌లో మహేశ్ బాబు మునుపెన్నడూ లేని విధంగా.. గడ్డం, పొడవాటి జుట్టుతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారని టాక్.
2. 'స్పిరిట్' షూటింగ్ కు బ్రేక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఈ నెలలో జరగాల్సిన కీలక షెడ్యూల్.. కొన్ని కారణాల వల్ల మే నెలకు వాయిదా పడింది. దీంతో ప్రభాస్ యూరోప్ వెకేషన్‌కు వెళ్లారు. ప్రభాస్ తిరిగి రాగానే మే మొదటి వారంలో 'స్పిరిట్' కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. కాగా, 'స్పిరిట్' షూటింగ్ వాయిదా పడటం వల్ల, వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.
3. నెవర్ బిఫోర్ లుక్ లో బాలయ్య
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న 'NBK 111' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బాలయ్య డార్క్ షేడ్స్‌తో కనిపించనున్న ఈ పాత్ర అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా ఉండనుంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో బాలకృష్ణ తన మునుపటి సినిమాలకు భిన్నమైన గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో అలరిస్తారట.
4. 'ఠాగూర్' విషయంలో రాజశేఖర్ ఆవేదన
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ 'ఠాగూర్' వాస్తవానికి తాను చేయాల్సిన సినిమా అని యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ అన్నారు. తమిళ మూవీ 'రమణ' రీమేక్ హక్కుల కోసం తాను అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయితే స్నేహితులను నమ్మి అగ్రిమెంట్ చేసుకోకపోవడమే తాను చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ తర్వాత నిర్మాత ఠాగూర్ మధు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో.. నన్ను కాదని, ఆ రీమేక్ హక్కులు ఆయనకు ఇచ్చేశారని తెలిపారు. అలా ఆ ప్రాజెక్ట్ చిరంజీవి దగ్గరకు వెళ్లిందని చెప్పారు.
5. 'సతీ లీలావతి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మార్చి 6న విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. భార్యాభర్తల మధ్య తలెత్తే సహజమైన గొడవలు, భావోద్వేగాల నేపథ్యంలో దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
6. 'డార్లింగ్' వసూళ్ల సునామీ!
ప్రభాస్ నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'డార్లింగ్' రీ-రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే రూ. 7 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా జోరు కొనసాగిస్తూ మరో రూ. 2 కోట్లపైగా రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ. 9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది. రీ-రిలీజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా 'డార్లింగ్' సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
7. వారణాసి బ్యూటీకి అరుదైన గౌరవం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక 'గోల్డ్ గాలా 2026' వేడుకలో ఆమెకు 'గ్లోబల్ వాన్‌గార్డ్' (Global Vanguard) అవార్డును ప్రదానం చేయనున్నారు. . ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వివిధ రంగాల్లో సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు. సినీ రంగంలో ఆమె సాధించిన అసాధారణ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
8. 'జన నాయగన్' ఎడిటర్ కు బిగ్ షాక్
'జన నాయగన్' సినిమా లీకైన వ్యవహారంలో ఆ చిత్ర ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్‌పై 'సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్' అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ లీకేజీకి ప్రదీప్ ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోయినా, ఆయన అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని అసోసియేషన్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
9. రజినీకాంత్‌కి విలన్‌గా స్టార్ డైరెక్టర్?
రజనీకాంత్ 173వ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ను సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, రజనీ-శంకర్ కాంబినేషన్‌లో హీరో-విలన్ పోరాటాన్ని వెండితెరపై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు.
10. హీరో కుమార్తెను వేధించిన వ్యక్తి అరెస్ట్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైన కేసులో.. మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపగా.. ఆమె వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.




