
టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డారు. ఒక యువతి ఫిర్యాదుతో.. విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై సంచలన కేసు నమోదైంది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ సిప్లిగంజ్ బంధువు అని చెప్పుకునే కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ యువతి గర్భం దాల్చగా.. రాహుల్ రెడ్డి ఆ ప్రెగ్నెన్సీని బలవంతంగా తీసివేయించాడని ఆరోపించింది. ఆపై పెళ్లి మాట ఎత్తకుండా ముఖం చాటేయడంతో, బాధితురాలు గత ఏడాది మార్చిలోనే రాహుల్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పోరాటం ప్రారంభించింది.
ఈ కేసు తర్వాత కర్పూరపు రాహుల్ రెడ్డికి మద్దతుగా రంగంలోకి దిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే యశస్విని రెడ్డి, విగ్నేష్, హరిణ్య రెడ్డి, నరేష్, ఉదయ్, శివన్నారాయణ, సువర్ణ, కార్తీక్, కేఆర్ రెడ్డి, ప్రసన్న అనే వ్యక్తులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని బాధితురాలు జూన్ నెలలో మరో ఫిర్యాదు ఇచ్చింది. దీంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు.
బాధితురాలు తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేసింది. తనపై హనీ ట్రాప్ ఆరోపణలు మోపారని, తనకు ఎయిడ్స్ ఉందంటూ దుష్ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా, ప్రైవేట్ ఫోటోలు, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది.
మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన పెద్ద మనుషులు కూడా న్యాయం చేయకపోగా.. రాహుల్ రెడ్డికే కొమ్ముకాస్తూ, తన ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరించారని ఆమె వాపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు కేసులోని మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Rahul Sipligunj, Controversy, Police Case, Vizag






