Home

»

Latest News

టాప్ 10 క్లాసిక్స్: సింగీతం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలు అసలు మిస్ అవ్వకండి.!

Oct 4, 2026 10:13AM

వైవిధ్యభరిత చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుడిగా తనదైన ముద్రవేసిన సింగీతం.. తన కెరీర్ లో పలు విజయాలను చూశారు. అలాగే అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అలాంటి సింగీతం కెరీర్ లో టాప్ 10 క్లాసిక్స్ ఏంటో చూద్దాం..

పంతులమ్మ: నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం సొంతం చేసుకున్న మ్యూజికల్ హిట్ ఇది. రంగనాథ్, లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా 1978లో తెరపైకి వచ్చింది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ సాగే పాపులర్ గీతం ఇందులోనిదే.

సొమ్మొకడిది సోకొకడిది: లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సింగీతం రూపొందించిన తొలి చిత్రమిది. జయసుధ, రోజా రమణి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1979లో సందడి చేసింది. అబ్బో నేరేడు పళ్ళు అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోదే. ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు.

మయూరి: ఏకంగా 14 నంది పురస్కారాలు కైవసం చేసుకున్న క్లాసిక్ మూవీ ఇది. క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో.. సుధా చంద్రన్ తన పాత్రను తనే స్వయంగా పోషించడం విశేషం. 1985లో రిలీజైన ఈ సంచలన చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఇటు నంది, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు సింగీతం. 

పుష్పక విమానం: మాటల్లేకుండా సింగీతం రూపొందించిన బ్లాక్ కామెడీ మూవీ ఇది. కమల్ హాసన్, అమల జంటగా నటించిన ఈ సినిమా ఒక జాతీయ పురస్కారంతో పాటు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకుంది. 1987లో ఈ క్లాసిక్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పలు రకాల టైటిల్స్ తో  జనం ముందు నిలిచింది.

విచిత్ర సోదరులు: కమల్ హాసన్ త్రిపాత్రాభినయంలో సింగీతం తెరకెక్కించిన క్లాసిక్ ఇది. ఇందులో మరగుజ్జు పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. అపూర్వ సగోదరగళ్ పేరుతో ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ.. తెలుగులో విచిత్ర సోదరులు పేరుతో అనువాదమై అలరించింది. 1989లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు రెండు తమిళనాడు స్టేట్ అవార్డులను సైతం సొంతం చేసుకుందీ సినిమా.

మైఖేల్ మదన కామ రాజు: కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా రికార్డులకెక్కిన ఈ మూవీ.. అప్పట్లో ఓ సంచలనం. సింగీతం మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ క్లాసిక్ 1990లో రిలీజైంది.

ఆదిత్య 369: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఓ విభిన్న ప్రయత్నం. మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. 1991లో ఈ క్లాసిక్ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసింది.

బృందావనం: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన మ్యూజికల్ హిట్ ఇది. ఈ సినిమాకి గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు సింగీతం. 1992లో ఈ క్లాసిక్ విడుదలైంది.

మేడమ్: రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో భలేగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రెండు విభాగాల్లో నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. 1994లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది.

భైరవ ద్వీపం: తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం సృష్టించిన జానపద చిత్రం.. భైరవద్వీపం. బాలకృష్ణ, రోజా జంటగా నటించిన ఈ క్లాసిక్.. అప్పట్లో విశేషాదరణ పొందింది. 1994లో ఈ జనరంజక చిత్రం సందడి చేసింది.  

 

 

 

[Singeetham Top 10 Movies, Singeetham Best Movies, Singeetham Classic Movies, Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com