
తెలుగు సినిమా గొప్ప ప్రయోగశీల దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. 94 ఏళ్ల వయసులో శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినిమా మాత్రమే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనూ ఓ గొప్ప అధ్యాయం ముగిసినట్టైంది.
సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే. అప్పటి పరిస్థితుల్లో ఊహించడానికే కష్టమైన కాన్సెప్ట్స్‌ను తెరపై చూపించిన దర్శకుడిగా సింగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
సింగీతం మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. వైవిధ్యమైన కథాంశాలు, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడు సింగీతం అని కొనియాడారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
మరోవైపు సింగీతం మృతిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘మయూరి’ వంటి సినిమాలను గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడిగా సింగీతాన్ని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సింగీతం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్ మదన కామరాజు’ వంటి సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలను గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాపై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.
ఇక నందమూరి బాలకృష్ణకు సింగీతం శ్రీనివాసరావుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ వంటి విభిన్నమైన చిత్రాలు వచ్చాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఈ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.
సింగీతం మృతిపై బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిందని, ‘భైరవ ద్వీపం’ జానపద చిత్రాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. సింగీతం మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని బాలకృష్ణ అన్నారు.
సింగీతం శ్రీనివాసరావు ఓ విజనరీ అని చిరంజీవి కొనియాడారు. కొత్త ఆలోచనలను తెరపై ఆవిష్కరించేందుకు ఆయన చూపించిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించిందని పేర్కొన్నారు. సినిమాకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ ఎంతో గౌరవంతో, అభిమానంతో గుర్తు చేసుకుంటామని అన్నారు.
[Singeetham Srinivasa Rao, Singeetham Passed Away, Singeetham Death, Singeetham Movies, Telangana CM Revanth Reddy, Chiranjeevi, Nandamuri Balakrishna, Pawan Kalyan, Jr NTR]





