
చెన్నై చందమామలకు ప్రేమకథలు అంతగా కలిసి రావడం లేదు. కొన్నాళ్ల క్రితం వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష ప్రేమలో పడింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అభిప్రాయాలు కలవక విడిపోయారు. సేమ్ టు సేమ్... శృతి హాసన్ విషయంలోనూ ఇదే జరిగింది. కమల్ హాసన్ కూతురు నిశ్చితార్థం చేసుకోలేదు గానీ... లండన్, లాస్ ఏంజిల్స్ వీధుల్లో ఫారిన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ... ప్రేమలో మునిగి తేలింది.
శృతి హాసన్ బంధువుల పెళ్ళికి మైఖేల్ కోర్సలే ఇండియా వచ్చాడు. కమల్ హాసన్, శృతి కుటుంబ సభ్యులను కలిశాడు. ఎప్పటికైనా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారని ప్రేక్షకులు అనుకుంటున్న తరుణంలో బ్రేకప్ అయినట్టు మైఖేల్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "జీవితం మా ఇద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు... మేం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ, ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉంటుంది. జీవితాంతం ఆమెకు ఓ స్నేహితుడిగా ఉంటున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నా" అని సోషల్ మీడియాలో మైఖేల్ పోస్ట్ చేశాడు. దాంతో ఈ ప్రేమకథ కూడా పెళ్లి పీటలకు చేరదని స్పష్టమైంది. మైఖేల్ తో ప్రేమలో ఉన్నన్ని రోజులూ శృతి హాసన్ సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇండియా తిరిగొచ్చి సినిమాలు చేస్తుండటంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అనుకున్నారంతా. అదే నిజమైంది. మైఖేల్ ఏ పోస్ట్ చేసినా లైక్ కొట్టే శ్రుతిహాసన్ లేటెస్ట్ పోస్టుకు మాత్రం లైక్ కొట్టలేదు. బ్రేకప్ గురించి ఎటువంటి పోస్ట్ చేయలేదు. పరస్పర అంగీకారంతో మైఖేల్, శృతి విడిపోయారని వాళ్ళ సన్నిహితులు చెబుతున్నా... చూస్తుంటే శృతి చాలా బాధపడినట్టు ఉంది.






