Home

»

Latest News

‘గబ్బర్ సింగ్’పై శృతి హాసన్ కామెంట్స్: తెలుగు సినిమాలను విమర్శించే హీరోయిన్లకు చురక.!

Nov 8, 2026 5:14PM

కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. మరికొన్ని సినిమాలు మాత్రం నటీనటుల కెరీర్‌నే మార్చేస్తాయి. అలాంటి సినిమానే పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా శృతి హాసన్ కెరీర్‌కు ఎంత పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడిన శృతి.. తనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శృతి హాసన్ కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’, తమిళంలో ‘7ఆమ్ అరివు’ వంటి సినిమాల్లో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అలాంటి సమయంలో 2012లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గబ్బర్ సింగ్’ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.

ఈ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రలో శృతి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చింది. అప్పటివరకు విమర్శించిన వారే గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గబ్బర్ సింగ్’ గురించి మాట్లాడిన శృతి.. ఈ సినిమా తన జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో గుర్తు చేసుకున్నారు. ‘‘గబ్బర్ సింగ్‌కు ముందు శృతి హాసన్ వేరు.. ఆ సినిమా తర్వాత శృతి హాసన్ వేరు. అది చాలా పెద్ద హిట్. నా కెరీర్‌నే మార్చేసింది. టాలీవుడ్‌లో ఓవర్‌నైట్ భాగ్యలక్ష్మిని అయిపోయాను. నా దశ మారిపోయింది. ఆ తర్వాత రకరకాల కథలు, పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి’’ అని చెప్పారు.

తాను తెలుగమ్మాయిని కాకపోయినా తెలుగు ప్రేక్షకులు తనను ఒక తెలుగు అమ్మాయిలాగే ఆదరించారని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఇచ్చిన పేరు, గుర్తింపుకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.

కొందరు హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసి.. డబ్బు, పేరు సంపాదించి.. ఆ తర్వాత తెలుగు సినిమాలనే విమర్శించడం చూస్తున్నాం. కానీ, శృతి హాసన్ మాత్రం తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, ఆ విజయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా మాట్లాడుతుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

 

 

 

[Shruti Haasan About Gabbar Singh, Shruti Haasan Interview, Gabbar Singh Movie, Pawan Kalyan, Shruti Haasan, Tollywood, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com