Home

»

Latest News

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. శివన్నకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.!

Oct 7, 2026 8:49PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘బెయిల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శివన్న.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే శివరాజ్ కుమార్ థియేటర్‌లోకి వెళ్తున్న సమయంలో ఆయనకు అత్యంత సమీపంలో ఒక్కసారిగా బాణసంచా పేలడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

చిత్రదుర్గలోని బసవేశ్వర థియేటర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శివరాజ్ కుమార్ రాక సందర్భంగా అభిమానులు టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన థియేటర్ ఎంట్రన్స్‌కు చేరుకునే సమయంలో అక్కడ ఉంచిన బాణసంచాలో ఒకటి అకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు, నిప్పురవ్వలు ఆయనకు చాలా దగ్గరగా కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన శివన్న తన ముఖం, తలను చేతులతో కప్పుకుని అక్కడి నుంచి పక్కకు జరిగారు. వెంటనే భద్రతా సిబ్బంది కూడా ఆయన చుట్టూ చేరి రక్షణగా నిలిచారు.

ఈ అనూహ్య ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ శివరాజ్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన నుంచి తేరుకున్న ఆయన అభిమానులను పలకరిస్తూ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివన్నకు అంత దగ్గరగా టపాసులు పేలడం చూసిన అభిమానులు.. ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శివరాజ్ కుమార్ నటించిన ‘బెయిల్’ విషయానికి వస్తే.. పవన్ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇందులో శివన్న విజయ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన చిత్రదుర్గలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘బెయిల్ 2’కు సంబంధించిన పనులు కూడా ప్లాన్ చేస్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం.

మరోవైపు శివరాజ్ కుమార్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ‘జైలర్’లో ఆయన చేసిన నరసింహ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. మొత్తంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్రదుర్గ వెళ్లిన శివన్నకు టపాసుల రూపంలో ఊహించని ప్రమాదం ఎదురైనా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 

[Shiva Rajkumar, Shiva Rajkumar Firecracker Accident, Shivarajkumar Accident, Shiva Rajkumar Narrow Escape, Shiva Rajkumar Viral Video, Shiva Rajkumar Bail Movie, Bail Movie Promotion, Bail Movie, Shiva Rajkumar Firecracker Incident]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com