హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఇందులో హీరోయిన్‌గా నటించబోయేది ఎవరో అధికారికంగా ప్రకటించారు.
‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటించనున్నారు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా శర్వానంద్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. సినిమాలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
మరోవైపు ‘జార్జ్ క్రిష్’కు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తనదైన శైలిని జోడించే శ్రీను వైట్ల.. ఈసారి శర్వానంద్‌తో ఎలాంటి కథను తెరకెక్కిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 14, 2027న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘జార్జ్ క్రిష్’ కూడా అదే సీజన్‌లో విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ కథను అందించారు.
ఇదిలా ఉంటే.. ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ గ్లింప్స్‌ను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. మానస వారణాసి పాత్రకు సంబంధించిన ప్రత్యేక అప్‌డేట్ కూడా రానుంది. దీంతో శర్వానంద్, మానస జోడీ తెరపై ఎలా ఉంటుందో, శ్రీను వైట్ల తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
[Sharwanand George Krish, George Krish Movie, Sharwanand New Movie, Manasa Varanasi, Sharwanand Manasa Varanasi, Sreenu Vaitla, George Krish Heroine, George Krish Release Date, Sharwanand Sankranthi Movie, George Krish Telugu Movie, Anup Rubens, AK Entertainments]





