టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘బెంగాల్ టైగర్’, ‘సీటీమార్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. ఇందుకు సెన్సార్ సమస్యలే కారణంగా తెలుస్తోంది.
నిజానికి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే అనూహ్యంగా ట్రైలర్ విడుదలతో పాటు ప్రీ రిలీజ్ వేడుకను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత సాంకేతిక కారణాల వల్ల కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. తాజాగా సెన్సార్ సమస్యల కారణంగానే సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక దృశ్యాల తీవ్రత కారణంగా సెన్సార్ బోర్డు సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. దీంతో చిత్రానికి ఇంకా తుది సర్టిఫికెట్ లభించలేదు. రివైజింగ్ కమిటీ పరిశీలన పూర్తయి, సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960ల నాటి తెలంగాణలో కొనసాగిన పటేల్ వ్యవస్థ, భూస్వాముల ఆధిపత్యం, వారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇందులో ఐదుగురు అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచే ఓ రగ్డ్ విలేజ్ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అప్పటి సామాజిక పరిస్థితులు, సంప్రదాయాలు, ఆధిపత్య పోరాటాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బొమ్మ ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం.!
ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా శర్వానంద్ మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘భోగి’కి సెన్సార్ రూపంలో బ్రేకులు పడటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలు, పీరియాడిక్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో రివైజింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సెన్సార్ సమస్యలు త్వరగా పరిష్కారమై కొత్త విడుదల తేదీ ఖరారవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ భోగి థియేటర్లలో ఎప్పుడు రగులుతుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు: ఉర్రూతలూగించిన ప్రభాస్, అనుష్క రొమాన్స్.. ‘కాటుక కళ్ళను చూస్తే..’
[Sharwanand Bhogi Movie, Bhogi Movie Story, Bhogi Movie Censor Issues, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi, Bhogi Movie Postponed, Telangana Period Drama, Sharwanand New Movie]






