వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్.. ఈసారి పక్కా మాస్ అవతారంలో ‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘ఎగిలివారంగా’ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. 1960ల నాటి పల్లె వాతావరణాన్ని, తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. పల్లెటూరి ప్రజల జీవన విధానం, వారి కష్టాలు, వృత్తులు, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ పాటకు ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ గాత్రాలతో పాటకు సహజమైన జానపద కళను తీసుకొచ్చారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో సాగిన పదాలు, పల్లె జీవితాన్ని ప్రతిబింబించే సాహిత్యం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం వినోదానికే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రజల శ్రమను, వారి జీవితాల్లోని కష్టాలను కూడా ఈ గీతం ఆవిష్కరిస్తోంది.
ఇక ‘భోగి’ సినిమాలో శర్వానంద్ కమ్మరోళ్ల గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ కందుల సులోచన పాత్రలో నటిస్తుండగా, డింపుల్ హయాతి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960ల ప్రారంభంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. గ్రామీణ ప్రజలు భూస్వాముల ఆధిపత్యంలో ఎదుర్కొనే అణచివేత, దానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి చేసే పోరాటం ఈ సినిమాలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో శర్వానంద్ రఫ్ అండ్ రగ్డ్ లుక్, పవర్‌ఫుల్ డైలాగులు సినిమాపై అంచనాలను పెంచాయి.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాతో శర్వానంద్ మాస్ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘భోగి’ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. తొలి పాటకు వస్తున్న స్పందన సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా శర్వానంద్ కెరీర్‌లో మరో విజయంగా నిలుస్తుందా? జానపద పాటలతో మొదలైన ఈ మ్యూజికల్ జర్నీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
[Sharwanand Bhogi Movie, Bhogi Egilivaranga Song, Sharwanand New Movie, Sampath Nandi Bhogi, Chandra Bose Lyrics, Bheems Ceciroleo Music, Anupama Parameswaran Bhogi]





