హీరోగా మరో వారసుడు.. టీమ్ లో 'సలార్', 'ఆర్ఆర్ఆర్' టెక్నీషియన్స్!
on Oct 20, 2021
వెండితెరకు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అలనాటి హీరో హరనాథ్ సోదరుడి మనవడు విరాట్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విరాట్ రాజ్ హీరోగా రూపొందుతున్న 'సీతామనోహర శ్రీరాఘవ' సినిమా నేడు(బుధవారం) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల కూడా పాల్గొని విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ చేసారు.
ఈ సందర్భంగా విరాట్ రాజ్ మాట్లాడుతూ.. "ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ 'సీతామనోహర శ్రీరాఘవ' సినిమా ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన సినిమాగా భావిస్తున్నాను. మీడియా, సినీ పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ.. "హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ సినిమా ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. కేజీఎఫ్-2, సలార్ చిత్రాలకు సంగీతం అందిస్తున్న 'రవి బస్ రుర్' ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయవంతమైన చిత్రంగా దీనిని మలచటానికి కృషి చేస్తాను" అన్నారు.
'వందన మూవీస్' బ్యానర్ పై సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విరాట్ కి జోడీగా రేవ నటిస్తుండగా.. ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు.
Also Read