Home

»

Latest News

18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైర‌ల్‌.!

Nov 22, 2026 4:19PM

బాలీవుడ్‌లోనూ, దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమీరా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల్లోనే తనకు ఎక్కువ గౌరవం, మంచి పారితోషికం, స్టార్‌డమ్ లభించాయని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. ఇప్పటికీ దక్షిణాది ప్రేక్షకులు తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారని, అందుకే తనను తాను ముందుగా సౌత్ ఇండియన్ నటిగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.

సమీరా రెడ్డి తన కెరీర్‌లో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్‌లాల్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. తెలుగులో 'జై చిరంజీవ', 'నరసింహుడు', 'అశోక్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక తమిళంలో సూర్య హీరోగా నటించిన 'వారణం ఆయిరం' సినిమాలో మేఘన పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలై 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకులు తనను మేఘనగానే గుర్తుపెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని సమీరా తెలిపారు.

దక్షిణాది సినిమాల్లో తనకు లభించిన గౌరవం, తన నటనకు ఇచ్చిన విలువ, పారితోషికం, స్టార్‌డమ్.. ఇవన్నీ హిందీ సినిమాలతో పోలిస్తే ఎంతో ఎక్కువని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ ప్రేక్షకులు తనను ఒకప్పటి నటిగా మాత్రమే గుర్తుచేసుకునే అవకాశం ఉందని, కానీ దక్షిణాదిలో మాత్రం అభిమానులు ఇప్పటికీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారని చెప్పారు. తన సినీ ప్రయాణంలో సౌత్ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ గోవాలో తన ఇద్దరు పిల్లల పెంపకంపై దృష్టి పెట్టిన సమీరా.. ఈ ఏడాది 'ఆఖ్రీ సవాల్' సినిమాతో తిరిగి నటిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో సంజయ్ దత్‌తో కలిసి నటించారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో సినిమాలకు దూరంగా ఉన్న తనకు, ఈ సినిమా షూటింగ్ విషయంలో సంజయ్ దత్ ఎంతో సహకరించారని గతంలో ఆమె వెల్లడించారు. వారాంతాల్లో షూటింగ్‌కు వచ్చేలా అవకాశం కల్పించడంతో రెండు, మూడు నెలల పాటు ప్రతి వీకెండ్‌లో షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపారు.

 

 

[SameeraReddy, VaaranamAayiram, JaiChiranjeeva, AshokMovie, NarasimhuduMovie, Aakhri Sawal]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com