#NBK107 టైటిల్ 'రౌడీయిజం' కాదు.. తేల్చేసిన నిర్మాతలు!
on Sep 15, 2021
నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'రౌడీయిజం' అనే టైటిల్ నిర్ణయించారంటూ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే అందులో నిజం లేదనీ, తామింకా టైటిల్ నిర్ణయించలేదనీ బుధవారం ఓ ప్రకటన ద్వారా నిర్మాతలు తేల్చేశారు. #NBK107 గా పరిగణిస్తోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బుధవారం తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన నోట్లో వారు, "మీడియాలో #NBK107 కి టైటిల్ ఫిక్స్ చేశారంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. సినిమా విషయంలో వెల్లువెత్తుతున్న అంచనాలు, ఎగ్జయిట్మెంట్ చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సనిమాకు సరిగ్గా సరిపోయే టైటిల్‌ను, ఇతర వివరాలను సరైన సమయంలో ప్రకటిస్తాం" అని రాసుకొచ్చారు. టైటిల్ విషయంలో ఎలాంటి ఊహాగానాలనూ నమ్మవద్దని వారు సూచించారు.
'క్రాక్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత గోపీచంద్‌తో బాలకృష్ణ జట్టు కడుతుండటంతో #NBK107 పై నిజంగానే అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ఒక పీరియడ్‌కు సంబంధించిన యథార్థ ఘటనలతో ఈ సినిమా స్క్రిప్టును గోపీచంద్ రూపొందించాడు. దాని కోసం తన రైటింగ్ టీమ్‌తో చాలా రిసెర్చి కూడా చేశాడు. గోపీ చెప్పిన స్టోరీకి ఎగ్జయిట్ అయిన బాలకృష్ణ మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో 'అఖండ' మూవీ చేస్తున్నారు. దాని తర్వాత గోపీచంద్ డైరెక్షన్లో నటించేందుకు ఆయన ప్రిపేర్ అవుతున్నారు.