
'శ్రీమంతుడు' సినిమా చూశారా? అందులో మహేష్ బాబు ఏం చేస్తాడు? గుర్తుందా? సిటీలో సకల ఐశ్వర్యాలను, సౌకర్యాలను వదిలేసి పల్లెటూరికి వెళతాడు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. తరవాత వ్యవసాయం చేస్తాడు. ఇంచు మించు రేణూ దేశాయ్ కూడా అలాగే చేస్తానంటున్నారు. ప్రస్తుతం రైతు సమస్యలపై ఒక న్యూస్ ఛానల్ కార్యక్రమం కోసం రాయలసీమలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు రేణూ దేశాయ్. రైతులకు మద్దతుగా కార్యక్రమం చేస్తున్న మీరు కొంత భూమి కొనుగోలు చేసి వ్యవసాయం ఎందుకు చేయకూడదు? అని ఆమెను ఒక నెటిజన్ కోరారు. అందుకు బదులుగా రేణూ దేశాయ్ "నాకు అటువంటి ప్లాన్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసి, వ్యవసాయం చేయాలనుంది. అలాగే, ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుంది" అని అన్నారు. మహేష్ బాబును 'శ్రీమంతుడు' అన్నాం. అటువంటి మంచి పని చేయాలనుకుంటున్న రేణూ దేశాయ్ ను 'కాబోయే శ్రీమంతురాలు' అనేద్దామా!!






