
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట గట్టిగా వినిపిస్తోంది. టాప్ హీరోలంతా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల ఒక్కో సినిమా కోసం కనీసం రెండేళ్లు, మూడేళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ ప్రభాస్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ కూడా, ఏడాదికి రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకువచ్చేలా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. ఈ స్పీడ్ చూసి మిగతా స్టార్ హీరోల అభిమానులు, తమ హీరోలు కూడా ప్రభాస్ లాగే స్పీడ్ గా చేయాలని కోరుకుంటున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే ‘రాజా సాబ్’తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ (Fauzi) సినిమాతో ఈ ఏడాదిలోనే థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక 2027 లో కూడా రెండు సినిమాలతో అలరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు ప్రభాస్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ లాంటి విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ కి వస్తున్న సీక్వెల్ ‘కల్కి 2’ (Kalki 2) షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొంటున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుండటంతో, ప్రభాస్ కూడా తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసి మరీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇవే కాకుండా మరో భారీ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉంది. అది కూడా త్వరలోనే అధికారికంగా అనౌన్స్ కానుంది. ఇలా ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ, థియేటర్లను కళకళలాడించడం కోసం ప్రభాస్ వేస్తున్న అడుగులు నిజంగా అభినందనీయం. మిగతా టాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయితే తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ మరింత పెరగడం ఖాయం.





