యంగ్ వెంకటేష్ మేనకోడలిగా రెబా జాన్
on Mar 12, 2020
మరో మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు తెరపైకి వస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'నారప్ప'తో రెబా జాన్ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఉంది కదా! తన కజిన్. రెబాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఇంతకు ముందు కొన్నికమర్షియల్ యాడ్స్ తో పాటు మలయాళంలో సినిమాలు చేసింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అవి చూశారు. అందులో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చడంతో 'నారప్ప'లో ఒక హీరోయిన్ గా తీసుకున్నారు.
వెంకటేష్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్నదని చెప్పారు కదా! సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉందా? అంటే... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రెబా జాన్ వస్తుంది. హీరో మేనకోడలి పాత్ర అది. యంగ్ వెంకటేష్ మేనకోడలి పాత్ర అన్నమాట.
సినిమాలో హీరోకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అతడిని పెళ్లి చేసుకోవడానికి, పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. మామ అంటే మేనకోడలికి చాలా ఇష్టం. నేరుగా మామ దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. మామ, మేనకోడలు మధ్య మంచి ట్రాక్ ఉంటుంది. అసలు హీరో పాత్రలో మార్పుకు కారణం మేనకోడలి పాత్రే. తెలుగులో మార్పులు ఏమైనా చేశారేమో చూడాలి.
Also Read